Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి మార్పుపై కారణం చెప్పాలి
- కొనుగోలు కేంద్రాలు పెడతామని ప్రకటన చేయాలి
- సాగు చట్టాల రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
- విలేకర్ల సమావేశంలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకు మంత్రి హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌కు అర్హత లేదా అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ అవుతున్నారని, ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెబుతున్నారని చెప్పారు. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో ఆ పార్టీ అంతర్గత విషయ మన్నారు. ఏదైనా బలమైన కారణం ఉంటేనే ముఖ్య మంత్రి మార్పు ఉంటుందని, ఆ కారణం ఏంటో ప్రజలకు చెప్పాలని కోరారు. ఈ యాసంగి సీజన్‌లో దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయబోమని ముఖ్య మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేశారని తెలిపారు. కానీ వానాకాలం సీజన్‌లో అత్యధికంగా ధాన్యాన్ని సాగు చేశారని, దానికి సరైన మద్దతు ధర అందలేదని ఇప్పుడు ఈ సీజన్‌లో 1010 ధాన్యాన్ని అత్యధికంగా సాగు చేశారని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు ఎంతో మనో వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసే విధంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలు రద్దు విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. రైెతు పోరాటానికి మద్దతుగా ఈ నెల 23, 24 తేదీల్లో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో రైతు జాత పర్యటిస్తోందని, జాతా 24న మిర్యాలగూడకు చేరుకుంటుందని తెలిపారు. ఈ నెల 26న రైతులకు మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి జగదీష్‌చంద్ర, జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఎమ్‌డి.అంజద్ తదితరులు పాల్గొన్నారు.