Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నవామపక్షాల అభ్యర్థి జయసారధిరెడ్డికి పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వారని, ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధిరెడ్డి విజయాన్నికాంక్షిస్తూ హాలియా యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, శాసనమండలిలో పట్టభద్రుల, నిరుద్యోగుల సమస్యలపై ప్రతిఘటించి పట్టభద్రుల వాణి వినిపించగల సమర్థవంతమైన నాయకుడన్నారు. గతంలో గెలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అధికార పార్టీకి సంబంధించిన వారని, పట్టభద్ర సమస్యలపై ఏం స్పందించారని, ఏం మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అడ్డం పెట్టుకొని విద్యాసంస్థల్లో వందల కోట్ల లాభాలను ఆర్జించారు తప్ప పట్టభద్రులకు ఒరిగిందేమీ లేదన్నారు. పదవుల కోసం పాకులాడే టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పి వామపక్షాల అభ్యర్థిగా జయసారధిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు వీరరాఘవులు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదయ్య, టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వీర్రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారపు నరేశ్, నాయకులు కత్తి శ్రీనివాస్ రెడ్డి, సైదులు, వీరాసింగ్, సయ్యద్ పాల్గొన్నారు.