Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్‌శక్తులతో కలిసి జాయింట్ వ్యాపారం చేస్తుందని, తద్వారా ప్రజలకు కష్టాలు.. కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూరుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక ఎంవీఎన్ భవనంలో నిర్వహించిన పార్టీ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్‌శక్తులకు అమ్మి వారితో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడి పెద్దఎత్తున మోడీ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుండి హద్దూపద్దూ లేకుండా ప్రజలపై పన్నుల భారాలు పెరుగుతున్నాయన్నారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తుందన్నారు.ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల, రవాణాచార్జీలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారన్నారు.కరోనా లాక్‌డౌన్‌లో ప్రజలకు ఆదాయం తగ్గి పరిశ్రమలు మూతబడి, వ్యాపారాలు పడిపోయి, నిరుద్యోగం పెరిగి ఆర్థికమాంద్యం పెరిగిన సమయంలో పన్నులు పెంచి ప్రజల నడ్డివిరిచే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా సమాజానికి, ప్రజలకు అవసరం లేనటువంటి పనులు చేస్తూ వారిని కష్టాలపాలు చేస్తున్నారన్నారు. ప్రజా,కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు.దేశంలో కార్పొరేట్‌శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఒకపక్క కార్మికులు సమ్మెలు,ధర్నాలు చేస్తూ ఉద్యమిస్తుంటే మరోపక్క 91 రోజులనుండి రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలని వీరోచిత పోరాటం నడుపుతున్నా,250 మంది రైతులు అమరులైన మోడీకి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు.మొన్న కార్మికులు నిన్న రైతులు నేడు పెరుగుతున్న ధరలను, జీఎస్టీని అరికట్టాలని వ్యాపారవర్గాలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఉద్యమా ల్లోకి వస్తున్నారన్నారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటంలోకి రావాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. దేశంలో కార్మికులు, రైతులు, పేదలు చేసినటువంటి ప్రజా ఉద్యమాలతో మోడీ పతనం కాక తప్పదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తోందన్నారు. రైతు చట్టాలకు వ్యతి రేకంగా పని చేస్తానని చెప్పి ఢిల్లీకి వెళ్లి వచ్చి రైతు చట్టాలను సమర్థిస్తూ వ్యాఖ్యానించడం దుర్మార్గ మన్నారు.రాష్ట్రంలో వెంటనే పంట కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేయకపోతే, శాసనసభలో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు ప్రత్యామ్నాయంగా పోరాటాలు ఉధతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మీ, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు, ధీరావత్ రవినాయక్ పాల్గొన్నారు.