Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి అర్ధరాత్రి నుంచి పెద్దగట్టు జాతర ప్రారంభం
- మార్చి నాలుగు వరకు జరగనున్న జాతర
- సుమారు కోటికిపైగా భక్తులు వచ్చే అవకాశం
- గట్టుకు చైర్మెన్ లేకుండానే జాతర
నవతెలంగాణ- సూర్యాపేట
రాష్ట్రంలో అత్యంత ప్రాచీన దైవక్షేత్రం శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం.ఈ దేవస్థాన సన్నిధిలో ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ జాతర రాష్ట్రంలో రెండోఅతిపెద్ద జాతరగా పేరు గాంచింది. అందుకే దీనికి పెద్దగటు ్ట(గొల్లగట్టు) జాతరగా భక్తులు పిలుచుకుంటారు. నేటి అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభం కానుంది.ఈ జాతర కోసం దేశం నలుమూలల నుండి భక్తులు అనేకం వచ్చి వెళ్తుంటారు.ఉమ్మడి రాష్ట్రంలో నుండి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు వచ్చేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులతో అన్ని ఏర్పాట్లను సమకూర్చింది.భక్తులకు సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఈ ఆలయానికి ఒక ప్రత్యేక ట్రస్ట్ బోర్డు చైర్మెన్‌ను ఎంపిక చేస్తుంది.కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట య్యాక ఈ ఆలయానికి చైర్మెన్‌ను నియ మించకుండానే కేవలం అధికారుల సమక్షంలోనే జరుగుతుంది.గతం నుండి ఇప్పటివరకు చైర్మెన్ లేకుండా జరిగే జాతరగా ప్రస్తుతం చరిత్ర పుటల్లోకెక్కనుంది.
జాతర చరిత్ర తెలుసుకుందాం....
యాదవవంశానికి చెందిన ధ్రువబిధరవర్ష మహారాజు (780-793 ) తన పేరిట గ్రామాన్ని నిర్మించారని,ఆ రాజు నిర్మించిన గ్రామమే దురాజ్ పల్లిగా పేరొందిందనేది చరిత్ర చెబుతుంది. యాదవుల ఆరాధ్య దైవం లింగ మంతుల స్వామి కొలువుండే గొల్లగట్టు. పూర్వ కాలంలో యాదవ రాజులు ఉండ్రుగొండ గుట్ట మీద శివాలయం, లక్ష్మీనర్సింహాస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మతల్లి, ఆంజ నేయుడి దేవాలయాలు కట్టించారు. రెండేండ్ల కోసారి జరిగే లింగమంతుల జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు దిష్టిపూజ (ఈనెల 14న జరిగింది) మహోత్సవం జరుగుతుంది.మాఘశుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టి కుంభాన్ని, ఉమ్మడి వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి దేవరపెట్టెను తీసుకు రాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు పెద్దగట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు.ఆదివారం ప్రారంభంకానున్న ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది.జాతర ప్రారంభం రోజు అర్థరాత్రి యాదవ పెద్దలు సూర్యాపేట మండలం కేసారం నుండి దేవరపెట్టె, బోనం గంపను గుట్టపైకి తీసుకు వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవర పెట్టెలో ఉన్న దేవతామూర్తులను ఆల యంలో ప్రతిష్ఠించడంతో ప్రధాన ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
ఐదు రోజుల పాటు జరిగే అపురూపమైన జాతరతొలిరోజు.....దేవరపెట్టే రాక
దేవరపెట్టె తరలింపు
జిల్లాలోని దురాజ్‌పల్లిలో పెద్ద(గొల్ల)గట్టు లింగమంతులస్వామి జాతర ఆదివారం (తెల్లవారు జామున) రాత్రి ప్రారంభమవుతుంది. సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామంలో దేవరపెట్టె వద్ద దేవతావిగ్రహాలకు ప్రత్యేకపూజల తర్వాత మహిళల కోలాటాలు, భేరీలు, గజ్జెల చప్పుళ్లు, కత్తులు, కటారుల విన్యాసం, భక్తుల జయజయధ్వానాల నడుమ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవరపెట్టె పెద్దగట్టుకు చేరుకుంటుంది.
రెండవ రోజు ....బోనాలు
రెండోరోజు కంకణఅలంకరణలు స్వామివారి కొలుపులు రెండవ రోజు యాదవ పూజారులు పోలుముంతలు.. బొట్లు.. కంకణఅలంకరణలు చేయగా..మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పిస్తారు.
మూడవ రోజు...చంద్రపట్నం
మూడవరోజు కీలక ఘట్టం.. వైభవంగా స్వామివారి చంద్ర పట్నం.ఇక మూడోరోజైన మంగళవారం చంద్రపట్నం వేస్తారు.బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగువైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు.జాతరలో కీలకమైన 'చంద్రపట్నం' తంతు వైభవంగా జరిపిస్తారు.తొలుత పసుపు, బియ్యం పిండి, కుంకుమతో ఆలయ ఆవరణలో ఆకర్షణీయంగా చంద్రపట్నం వేసి దేవరపెట్టెను ప్రతిష్టి పజేస్తారు.అనంతరం లింగమంతులస్వామి, మాణిక్యమ్మ కల్యాణ మహౌత్సవాన్ని యాదవ పూజారులు సంప్రదాయరీతిలో పూర్తి చేస్తారు.
వరుడు లింగమంతుల స్వామి
వధువు మాణిక్యమ్మ
వరుడు లింగమంతుల స్వామి తరఫున మెంతబోయిన యాదవ్ వంశీయులు, వధువు మాణిక్యమ్మ తరఫున మున్న యాదవ వంశం వారు పరిణయ వేడుకలో పాల్గొంటారు. దేవరపెట్టె పూజారులుగా తండు వంశీయులు కల్యాణాన్ని దగ్గరుండి పూర్తి చేయిస్తారు. పోతురాజు, భైరవుడి వేషధారణలో ఇరువర్గాల వారు సంప్రదాయపద్ధతిలో కత్తులు, కటారులు తిప్పి స్వామికి మొక్కులు చెల్లిస్తారు.
నాలుగో రోజు...నెలవారం
రోజుల్లో దేవరపెట్టె కేసారం గ్రామానికి తరలింపు..మకర తోరణం తొలగింపు బుధవారం జాతరలో భాగంగా నెలవారంవేడుక నిర్వహిస్తారు .దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి వచ్చే జాతరకు తీసుకొస్తారు.
ఐదో రోజు...మూల విరాట్
అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. దీంతో ఐదు రోజుల పాటు జరిగే పెద్దగట్టు జాతర ముగుస్తుంది.శంభులింగా అంటూ ఐదు రోజుల పాటు స్వామివారిని పూజించిన లింగమంతుల స్వామి భక్తులు తిరిగి తమతమ స్వగ్రామాలకు పయన మవుతారు. నాదిగా సంప్రదాయంగా, లింగమంతుల ఆచారంగా వస్తున్న గొల్లగట్టు జాతరలో మొక్కులు చెల్లించి రెండేండ్ల తర్వాత మరోమారు ఇంతే ఘనంగా జాతరకు వస్తామని లింగ మంతుల స్వామికి చెప్పి మరీ వెళ్తారు.ఐదురోజుల పాటు కొండకోనల్లో ఆటపాటలతో భేరీల చప్పుళ్ళతో ఆ లింగమయ్య నామస్మరణలో భక్తులు ఆనంద పారవశ్యంతో పెద్దగట్టు జాతర నిర్వహిస్తారు.