Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింగా... ఓ లింగా అంటూ మారుమోగిన పెద్దగట్టు
- భక్తుల్లో కనిపించని కరోనా ప్రభావం....
- వాహనాల మళ్లింపులో పోలీసుల అలసత్వం
- గంటల తరబడి రోడ్డుపై వేచి ఉన్న భక్తులు
- బెల్టుషాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రంలో రెండో పెద్దజాతరగా మారుమోగుతున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి సోమవారం రెండవ రోజు భక్తులు భారీఎత్తున తరలివచ్చారు. రహదారులన్నీ జన సందోహంతో కూరుకు పోయాయి.గజ్జెల లాగుల చప్పుళ్లు..... బేరీల మోతలు..... డప్పులు వాయి ద్యాలు,.....మహిళల కోలాటాలు,....యాదవుల కత్తి కటారుల విన్యాసాలు.....జయ జయ ధ్వానాల మధ్య జాతర రెండవరోజు అట్టహాసంగా కొనసాగింది.వెరసి భక్తుల కోలాహలంతో పెద్దగట్టు జనసంద్రమైంది.పెద్దగట్టుకి నలుదిక్కుల ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్లు,ఇతర వాహనాలల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు..ఓ లింగా...ఓ లింగా అంటూ చిన్నా...పెద్దా, పురుషులు, మహిళలు అనే తారతమ్యం లేకుండా లింగన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.మొదటి రోజు భక్తులు సుమారు రెండు నుండి మూడు లక్షల మంది రాగా,రెండవ రోజు అమాంతంగా 30 నుండి 35 లక్షల మందికి పెరిగారు.ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టె పెద్దగట్టుకి తరలించాగానే భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు దారులు వెతుక్కున్నారు. అర్ధరాత్రి నుండి సాయంత్రం వరకు భక్తులు వచ్చిపోతూనే ఉన్నారు.గట్టుపై తమ తమ విన్యాసాలతో గట్టుపై లింగమంతుల స్వామికి తమ మొక్కులను సమర్పించుకున్నారు.పురుషులు వాయిద్యాల చప్పులతో విన్యాసాలు చేయగా,మహిళలు గంపలు,బోనాలు ఎత్తుకొని తమ మొక్కులు సమర్పించారు.కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే పూనకంతో ఊగిసలాడిపోయారు.మరి కొంతమంది మహిళలు తమ మొక్కులు తీరాలని గుడి ముందర కాసేపు పడుకొని తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు.
భక్తుల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించని వైద్యరోగ్య శాఖ....
పెద్దగట్టు లింగన్నకు మొక్కులు చెల్లించుకోవడాకి వచ్చిన భక్తులు ఏ ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు.కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ జాతరకు లక్షల్లో హాజరైన భక్తులకు ఇతరుల నుంచి తమకు ప్రాణహాని పొంచి ఉందన్న ఈ విషయాన్ని మర్చి పోయారు.జాతరకు హాజరైన భక్తుల్లో సుమారు 40 శాతం కంటే తక్కువగా మాస్కులు ధరించి,శానిటేషన్ చేసుకున్న వారు కూడా కనిపించలేదు.మిగిలిన భక్తులుగాని, గట్టుపైకి వెళ్లిన వ్యక్తులు గాని మాస్కులు ధరించకపోయినప్పటికి గుళ్ళోకి అను మతించడం విశేషం.దీనిపై భక్తులకు అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ కొంత నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.
దారి మళ్ళింపు ఏది..?
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు భక్తులు లక్షల్లో హాజరవుతారని పోలీసు అధికారులే ప్రకటించారు.అందుకు సిబ్బందికి ముందస్తుగానే జిల్లా పోలీసు యంత్రాంగం పలు సూచనలు చేసింది.హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలను వయా నార్కట్‌పల్లి మీదుగా, విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలు వయా కోదాడ మీదుగా మళ్లిస్తామని ముందుగానే ప్రకటించారు.కొన్ని బస్సులతో పాటు మిగతా వాహనాలను అటు వైపుగా పంపించినట్టు కనిపించలేదు.అట్టి వాహనాలు రహదారిపై రావడంతో భక్తుల వాహనాలు గంటల తరబడి రహదారిపైనే వేచి చూడాల్సి వచ్చింది.మంగళవారం అయినా పోలీసులు తమ బందోబస్తుపై ఎలా రివ్యూ చేసుకుంటారో వేచి చూద్దాం.
ఏరులై పారిన మద్యం..
రెండేండ్లకోసారి జరిగే పెద్దగట్టు జాతర మద్యం జాతరగా మారిపోయింది.ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన భక్తుల రాకపోకలు మద్యంపై మరింతగా ప్రభావం పడింది.లింగన్నకు పూజలు చేయడానికి ముందుగానే మద్యం బాబులు బెల్టుషాపుల వైపు పరుగులు పెట్టారు. కొంతమందైతే కొబ్బరి కాయలు,పువ్వులు,అగర్‌బత్తిలు చేతుల్లో పట్టుకొని బెల్టు షాపుల వద్ద నిల్చున్నారు.పురుషులతో పాటు స్త్రీలు కూడా పలు ప్రాంతాల్లో ఇలా కన్పించడం విశేషం.కరోనా నిబంధనలను గాలికొదిలి ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించడానికి పోటీపడ్డారు.