Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళారుల ఇష్టారాజ్యం
- దళారులకు అడ్డాగా పాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ
- ఏఈఓలకు ధాన్యం సేకరణ బాధ్యతలు
- కేంద్రాల ఏర్పాటుకు అధికారుల చర్యలు
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలో ఇంకా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించలేదు. ప్రస్తుతం ధాన్యం సేకరణ బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించారు.ఈనెల రెండో వారం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ఊసే మర్చిపోయారు. సేకరణలో జిల్లాను అగ్ర స్థానంలో ఉంచాలని అధికారులు తెలిపినా కానీ చర్యలు మాత్రం చేపట్టడం లేదు.దీంతో దళారులు సిండికేటుగా మారి పచ్చి ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చెందుతున్నారు.మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించక పోవడం తో ఎక్కడ పడితే అక్కడ,ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడే ధాన్యాన్ని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్న పరిస్థితి ఉంది.
ధాన్యం కొనడానికి దళారులు పోటీలు పడుతున్నారు. మండలకేంద్రంలోని పాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో యథేచ్ఛగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా అధికారులు మొద్దు నిద్రను వీడడం లేదు.
ఈ ఆవరణలోనే ఎంపీడీఓ కార్యాలయం, పీఏసీఎస్ కార్యాలయం, పీహెచ్‌సీ, మహిళా సమాఖ్య భవనం, ఉపాధిహామీ కార్యాలయం ఉన్నాయి. ఇన్ని శాఖల అధికారులు ప్రతిరోజూ చూస్తూ పోతున్నారే తప్ప దళారులు కార్యాలయ ఆవరణలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా ప్రశ్నించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే ఆవరణలో ధాన్యం కొనుగోలు చేసిన ఓ దళారీ రూ.కోటికి ఎగవేసిన విషయం విధితమే. అదే ఆవరణలో మరికొందరు దళారులు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా వ్యవసాయ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమా నాలు రేకెత్తుతున్నాయి. పైగా వారు క్వింటాకు రూ.1300 నుండి రూ.1400 కే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఐకేపీ, పీఏసీఎస్ కార్యాలయాల్లో కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి తమ ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.