Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
రెండేండ్ల పాటు కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించొద్దని లేబర్ కమిషనర్‌ను కోరుతూ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో సంతకాలు చేయించుకోవడాన్ని నిరసిస్తూ యాదగిరిగుట్ట, సూర్యాపేట డిపోల ఎదుట యూనియన్ నాయకులు, కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ, ఆర్టీసీ రక్షణకు కార్మిక యూనియన్‌లు ఉండాల్సిందేనని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల నుంచి బలవంతపు సంతకాల సేకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం స్థానిక డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం, సంస్థను రక్షించడం కోసం ఆర్టీసీలో యూనియన్లు ఏర్పడ్డాయని తెలిపారు. యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం కార్మికులకు కల్పించిందన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఆ హక్కులను ఉల్లంఘిస్తూ ఆర్టీసీలో యూనియన్ లేకుండా చేయాలని కుట్ర పన్నుతోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం యూనియన్లు కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారులు తమ విధులను మరిచి ప్రభుత్వ ఏజెంట్‌లా మారి ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్మిక వెల్ఫేర్ కౌన్సిల్ ఆర్టీసీలో రాజకీయ జోక్యం కల్పించడానికేనని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఉమ్మడి జిల్లా జేఏసీ కో కన్వీనర్ బత్తుల సుధాకర్, డిపో కన్వీనర్ అంజయ్య, కో కన్వీనర్ సైదులు, లచ్చయ్య, ఇంద్రయ్య, భాస్కర్, వెంకన్న, శ్రీనివాస్, రాజేశ్వరి, ఉమాదేవి, సరిత పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట : ఆర్టీసీలో యూనియన్లు ఉండొ ద్దని యాజమాన్యం బలవంతంగా సంతకాలు చేయిస్తుందని ఆరోపిస్తూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం డిపో ముందు గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రికి కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని, కానీ యూనియన్లు ఉండొద్దని కార్మికుల నుండి బలవంతపు సంతకాల సేకరణను వ్యతిరేకిస్తు న్నామన్నారు. ఆర్టీసీ యాజమాన్యమే కుట్ర పన్ని సంతకాల సేకరణ చేస్తుందని విమర్శించారు. స్థానిక డీఎం ఉదయం 5 గంటలకే డిపో వద్దకు వచ్చి కార్మికులను బెదిరించేలా వ్యవహరిస్తు న్నాడన్నారు.
ఇప్పటికే తాము డ్యూటీలో చేరినప్పటి నుండి వివిధ సమస్యలతో సతమతమ వుతున్నామన్నారు. యూనియన్లు లేకుంటే కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు జగదీశ్, యాదప్ప, జాల నర్సింహా, కార్మికులు పాల్గొన్నారు.