Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రికార్డు స్థాయిలో కొత్తగా 64,399 మందికి కరోనా
- మూడురోజులుగా 60వేలకుపైనే ...
- ఒక్కవారంలోనే 3.5లక్షల కేసులు.. 5244 మంది మృతి
న్యూఢిలీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిత్యం 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటంతో వైరస్ బారినపడిన వారి సంఖ్య 22 లక్షలకు చేరుకుంటున్నది. వరుసగా మూడో రోజుసైతం 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం వైరస్ వ్యాప్తికి అద్దం పడుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 64,399 మంది కరోనా బారినపడ్డారు. ఇదే సమయంలో 861 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 21,53,011 చేరింది. మొత్తం మరణాల సంఖ్య 43,379కి పెరిగింది. ప్రస్తుతం
6,28,747 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 14,80,885 మంది కోలుకున్నారు. దీంతో రివకరీ రేటు 68.78 శాతానికి చేరింది. కాగా, ఇప్పటివరకూ దేశంలో 2,41,06,535 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 7,19,364 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. కాగా ఒక్కవారం రోజుల్లోనే 3.5లక్షల కేసులు నమోదుకాగా..5244 మంది మరణించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ లెక్కన కరోనా వైరస్ ఎంత తీవ్రంగా విజృంభిస్తున్నదో..అంతే ఆందోళన దేశప్రజల్లోనూ వ్యక్తమవుతున్నది. మోడీ సర్కార్ వైరస్ నియంత్రణ చర్యలు గాలికొదిలి రాజకీయ ఎజెండా వైపే చూస్తున్నదని ప్రతిపక్షాలు,ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
వాయిస్ టెస్ట్‌తో కరోనా నిర్ధారణ
దేశంలో కరోనాతో అత్యధికంగా ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో ముంబయి మహానగరం ఒకటి. ఇప్పటికే అక్కడ లక్ష మందికి పైగా వైరస్ బారినపడ్డారు. ఇక్కడ కోవిడ్-19 సామాజిక వ్యాప్తి దశకు చేరిందన్న అభిప్రాయాల నేపథ్యంలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. కరోనా రోగులను గుర్తించేందుకు ఇప్పటివరకూ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తుండగా.. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఓ వ్యక్తి వాయిస్ టెస్ట్ చేసి అతడికి కరోనా ఉందో లేదో చెప్పేస్తారు. కరోనా అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తిని సెల్ ఫోన్‌లో గానీ, కంప్యూటర్ ద్వారా గానీ మాట్లాడితే, ఆ మాటలను అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషిస్తారు. ఆ వ్యక్తి మాటల్లోని హెచ్చుతగ్గులను పరిశీలించి, అతడి రోగ లక్షణాలను అంచనా వేయడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత.