Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కంటే.. ఆ చట్టాలతో ముప్పు
- ఎన్ని రోజులైనా ఇక్కడే
- జై జైవాన్... జై కిసాన్ నినాదాల హౌరు
- ఢిల్లీ సరిహద్దులోని నిరంకారీ మైదానానికి భారీగా రైతన్నలు
- అన్నదాతల ఆర్తనాదాన్ని ఆలకించాలి.: ప్రధానికి ప్రతిపక్షాల లేఖ
బురారీ నుంచి నవ తెలంగాణ ప్రతినిధి సాగర్ వనపర్తి:
ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి కంటే కూడా మోడీ ప్రభుత్వం తెచ్చిన కాలా కానున్ (వ్యవసాయ చట్టాలు) చాలా ప్రమాదకరమని అన్నదాతలు నినదిస్తున్నారు. కోవిడ్-19 వైరస్ ఉధృతి, వణికించే చలిని సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. కరోనా వైరస్ ఒక మనిషిని కొద్ది రోజులు మాత్రమే పట్టి పీడిస్తుందనీ, కానీ, ఈ చట్టాలు కార్యరూపం దాల్చితే రైతుల రెక్కల కష్టాన్ని, రక్తాన్ని జలగల మాదిరి పీల్చుకుతింటాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు వారు ప్రకటించారు. మూడు రోజుల నుంచి బీజేపీ ప్రభుత్వ నిరంకుశ నిర్బంధాన్ని ఎదుర్కొన్న అన్నదాతలు శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని నిరంకారీ మైదానం వైపు కదిలారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అన్నదాతలంతా భారీగా బురారీలోని నిరంకారీ స్టేడియంలోకి వచ్చారు. 'జై జవాన్... జై కిసాన్, కిసాన్ బచావో... దేశ్ బచావో' అన్న ప్లకార్డులు, నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతున్నది. డప్పు చప్పుళ్ళు, నత్యాలతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పాటలు పాడుతూ రైతులు తమ నిరసన తెలిపారు. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటామని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ట్రాక్టర్లు, ట్రక్కులు, మంచినీరు, వంట సామాగ్రి, దుప్పట్లు భారీ స్థాయిలో వెంట తెచ్చుకొని మైదానంలో కూర్చొని ఆందోళన తెలుపుతున్నారు.
రోడ్లపైనే స్నానం... నిరంకారీ మైదానంలో వంట
ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల నుంచి నిరంకారీ మైదానంలోకి చేరుకున్న రైతులు రోడ్లపైనే స్నానం చేస్తూ... స్టేడియంలో సామూహికంగా వంట చేసుకుంటున్నారు. దాదాపు నెల రోజులకు సరిపడ వంట సామాగ్రిని తెచ్చుకున్నారు. ఒక ట్రక్కు నిండ ఎండిన కట్టెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఇతర కూరగాయలు వెంట తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే తమ తిరుగు ప్రయాణం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. స్టేడియంలోకి వచ్చిన మీడియా సిబ్బంది, కేంద్ర బలగాలకి సైతం రైతులు ఆహారం, నీళ్ళు ఇవ్వటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
వందేండ్ల వ్యవసాయ విధానాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం : పంజాబ్ సీఎం
న్యాయమైన సమస్యలపై పోరాడుతున్న అన్నదాతలతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన శనివారం కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడినట్టు తెలిసింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పినట్టు రైతులను తాము రెచ్చగొట్టడం లేదని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంత ఆలస్యంగా స్పందించడం సరికాదు అని వ్యాఖ్యానించారు. దేశంలో సుమారు 100 ఏండ్లుగా కొనసాగుతున్న వ్యవసాయ విధానాన్ని ఒకేసారి మూడు చట్టాలతో దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
చర్చలకు కేంద్రం సిద్ధం : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... రైతులు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నదనిన్నారు.
రైతులకి ధర్నాకి ఏఐఏడబ్ల్యూయూ నేత విక్రమ్ సింగ్ సంఘీభావం
సింగూర్, బిరారీలో నిరసన తెలుపుతున్న రైతులను ఆలిండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్(ఏఐఏడబ్ల్యూయూ) నేత విక్రమ్‌సింగ్ సంఘీభావం తెలిపారు. నిరంకారీ స్టేడియానికి చేరిన రైతులను ఆయన పరామర్శించారు. రైతుల ధర్నాకు అండగా ఉంటామని హామీనిచ్చారు.
అణచివేత ఆపండి..ప్రధానికి ప్రతిపక్షాల లేఖ
రైతు వ్యతిరేక చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న అన్నదాతలను కేంద్ర బలగాలను ఉపయోగించి అణచివేత ఆపాలని... వారి డిమాండ్లని ఆలకించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రతిపక్ష పార్టీల నేతలు శనివారం లేఖ రాశారు. లేఖ రాసినవారిలో సీతారాం ఏచూరి (సీపీఐ-ఎం), డి రాజా (సీపీఐ), శరత్ పవార్ (ఎన్‌సీపీ), దీపాంకర్ భట్టాచార్య(సీపీఐ-ఎంఎల్), టిఆర్ బాలు (డీఎంకే) మనోజ్ ఝా(ఆర్జేడీ) దేవభ్రతా బిశ్వాస్(ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్), మనోజ్ భట్టాచార్య(ఆర్‌ఎస్పీ) తదితరులున్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ రైతులను ఈ విధంగా వేధించలేదని స్పష్టం చేశారు. రైతులపై టీయర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, లాఠీఛార్జీలు చేయడం సరికాదని తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై టీయర్ గ్యాస్, వాటర్ కెనన్స్ ప్రయోగించడంపై ప్రతిపక్షపార్టీల నేతలు లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసే ఈ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. కనీసం రైతుల ఆందోళన ఏంటో వినే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.