Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది రాష్ట్రాల్లోనే అధికం !
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం పెరుగుతూనే ఉంది. దీంతో పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు అధికం అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,810 మంది కరోనా సోకింది. ఇదే సమయంలో 496 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,36,696కు పెరిగింది. మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 93,92,920 చేరింది. ప్రస్తుతం 4,53,956 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 42,298 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 88,02,267కు పెరిగింది. దీంతో పాజిటివిటీ రేటు 93.7 శాతానికి, మరణాల రేటు 1.5 శాతానికి చేరింది. అయితే, దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. ఆ జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే, కొత్తగా నమోదైన మొత్తం మరణాల్లో 78 శాతం పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. కాగా, దేశంలో ఇప్పటివరకూ మొత్తం 13,95,03,803 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 12,83,449 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
జులై నాటికి 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్: ఐసీఎంఆర్
వచ్చే ఏడాది (2021) జులై నాటికి దేశంలోని 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐసీఎంఆర్ చీఫ్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ తెలిపారు. కోల్‌కతాలో నిర్వహించిన ఓ సమావేశంలో వర్చువల్ పద్ధతితో ఆయన మాట్లాడుతూ.. 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భారత్‌లో దేశ ప్రజల కోసమే కాకుండా ఇతర అభివద్ధి చెందుతున్న దేశాల కోసం కూడా టీకా తయారీ అవుతోందని చెప్పారు. దేశంలో 24 వ్యాక్సిన్ తయారీ యూనిట్లు, 19 కంపెనీలు కలిసి వ్యాక్సిన్ ను అభివద్ధి చేస్తున్నాయని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో మాస్కుల పాత్ర ఎంతో ఉంటుందనీ, ప్రస్తుతం ఐదు టీకాల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
కరోనా లక్షణాలున్న వారివల్లే వైరస్ వ్యాప్తి !
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై శాస్త్రవేత్తలు జరుపుతోన్న అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. కరోనా సోకినప్పటికీ లక్షణాలు లేని వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందనీ, వారితో పోల్చితే కరోనా లక్షణాలు ఉన్నవారు నాలుగు రెట్లు అధికంగా కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ముప్పు అధికంగా ఉంటుందని చెప్పారు. కరోనా నిర్ధారణ అయిన వెంటనే ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచాలని చెప్పారు. వివిధ ప్రదేశాల్లో కరోనా వ్యాప్తిపై వారు పరిశోధన జరిపి ఈ ఫలితాలను వెల్లడించారు. ఆఫీసులు, సామాజిక కార్యక్రమాల్లో కంటే ఇళ్లలోనే కరోనా వేగంగా వ్యాపిస్తుందనీ, కరోనా సోకిన వ్యక్తితో వరుసగా ఐదు రోజులు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారు.
మరో రెండు వారాల్లో కోవీషీల్డ్ అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు: పునావాలా
మరో రెండు వారాల్లో కరోనా టీకా కోవిషీల్డ్ ను అత్యవసర వినియోగ కోసం దరఖాస్తు చేసే పనిలో ఉన్నామని సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ సీఈవో అదార్ పునావాలా తెలిపారు. ప్రధాని మోడీతో టీకాపై సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం పునావాలా మాట్లాడుతూ.., ''ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ భారతదేశం నుంచి సరసమైన ధరలకు వచ్చే టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 50 నుండి 60 శాతం తయారవుతున్నాయని తెలిపారు. ''ప్రస్తుతానికి, ఎంత మోతాదులను కొనుగోలు చేస్తారనే దానిపై తమకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా హామీ అందలేదన్నారు. కానీ 2021 జూలై నాటికి ఇది 300-400 మిలియన్ మోతాదుల్లో వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని'' తెలిపారు.