Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశ్రామిక రంగ కార్మికుల దుస్థితి
- పని పరిస్థితులు కల్పిచండంలో ప్రభుత్వం విఫలం
- సర్వేలో వెల్లడైన విషయాలు
న్యూఢిల్లీ : కరోనా తదనంతర పరిస్థితులు దేశంలోని ప్రతి వర్గాన్నీ తీవ్రంగా ప్రభావితం చేసింది. కరోనా మహమ్మారి విజృంభణ ఒక ఎత్తయితే... ఆ తర్వాత మోడీ సర్కారు తీసుకున్న లాక్‌డౌన్ వంటి ఏకపక్ష నిర్ణయాలు దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పలువురు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థిలు ఏర్పడగా, అనేక మంది అత్తెసరు జీతాలతో జీవితాన్ని నెట్టుకురావాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయి. ఇక ఇలాంటి దారుణ పరిస్థితులు, కష్టాలు పారిశ్రామిక రంగంలోని కార్మికుల పైనా చూపెట్టాయని ఒక సర్వేలో తేలింది. ఈ రంగంలోని కార్మికులల్లో ఎక్కువ శాతం మందికి భద్రత లేదని వెల్లడైంది. అంతేకాకుండా చెల్లింపులు కూడా లేవని తేలింది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 మధ్య ఈ సర్వే జరిగింది. ఈ రంగంలోని వారికి పనిపరిస్థితులను మెరుగుపరిచి సామాజిక రక్షణ చర్యలకు పూనుకోవాలని సర్వే సూచించింది. సామాజిక సంస్థ గ్రామ్ వాణి ఈ సర్వేను నిర్వహించింది. 362 మంది కార్మికులను సంప్రదించింది. ఈ సర్వేలో కార్మికులు తాము ఎదుర్కొన్న బాధలు, అనుభవాలను వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం.. 60శాతం మంది కార్మికులు తాము పనిలో లేమని చెప్పారు. పనిచేస్తున్నవారిలో వారానికి మూడు- నాలుగురోజులు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నామని
వివరించారు. పరిస్థితులు అసమానత, దోపిడీ సంస్థాగతీకరణ వైపు వెలుతున్నాయని సర్వే పేర్కొన్నది. తమిళనాడులోని తిరుప్పూర్, హర్యానా, న్యూఢిల్లీ ప్రాంతాలకు చెందిన ఆటోమోటివ్, పాదరక్షలు, వస్త్రాలు, ఇతర రంగాలకు చెందిన పారిశ్రామిక కార్మికులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వస్త్ర రంగ కార్మికులు ఇతర రంగ కార్మికుల కనాన తీవ్రంగా దెబ్బతిన్నారు. తమ ఆదాయాలు నెలకు రూ.2000 ల కన్నా ఎక్కువగా తగ్గాయని చెప్పారు. '' పారిశ్రామి రంగ కార్మికులకు లాక్‌డౌన్ తర్వాత పని పరిస్థితులు కుంచించుకుపోయాయి. కరోనాకు ముందు పరిస్థితులతో పోల్చుకుంటే ఇవి అధ్వాన్నంగా ఉన్నట్టు అనిపిస్తోంది. తక్కువ పని మాత్రమే అందుబాటులో ఉన్నది. ఆదాయాలు తగ్గాయి. కానీ పని తీవ్రత మాత్రం పెరిగింది'' అని గ్రామ్ వాణి సహ వ్యవస్థాపకులు ఆదితేశ్వర్ సేథ్ అన్నారు. సామాజిక భద్ర తా వ్యవస్థలను పరిష్కరించడానికి, యజమానులకు జవాబుదారీగా ఉంచడా నికి కార్మికుల కోసం చట్టాలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకు రావడానికి తగిన చర్యలను ప్రభుత్వం తీసుకోలేదని ఆయన తెలిపారు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రతను పొందేటప్పుడు కార్మికులకు నిరుత్సాహపరిచే అనుభవాలే ఎదురయ్యాయని వెల్లడైంది. ఈ కారణంతో వారు సామాజిక భద్రతా వ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని సర్వేలో తేలింది.