Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందుపాతర పేలుడులో అసిస్టెంట్ కమాండెంట్ హతం
- మరో పది మంది జవాన్లకు తీవ్ర గాయాలు
రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర (ఐఈడీ) పేల్చారు. దీంతో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని చింతఫుగా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా 206 బెటాలియన్ జవాన్లు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి గాలింపు చేపట్టారు. ఈక్రమంలో తాడ్మెట్ల వద్ద అప్పటికే అమర్చిన మందుపాతరను మావోయి స్టులు పేల్చివేశారు. దీంతో కోబ్రా బెటాలియన్‌లోని పది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని ప్రత్యేక హెలి కాప్టర్‌లో రారుపూర్‌లోని ఆస్పత్రికి తరలించామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (బస్తర్ రేంజ్) పి.సుందర్ రాజ్ తెలిపారు. ఈ ఘటనలో కోబ్రా 206 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లావాసి అని వెల్లడిం చారు. కాగా గాయపడిన మిగతా కమాండోల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. అధికారిక లాంఛనాలతో అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావ్ మతదేహాన్ని అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇద్దరు జవాన్ల ఆత్మహత్య
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు జవాన్లు తమ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సుక్మా జిల్లాలోని పుష్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం దినేశ్ వర్మ (35) అనే జవాన్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ 4వ బెటాలియన్‌లో విధులు నిర్వహస్తున్నారు. సెలవుపై ఇంటికి వెళ్లి తిరిగి ఈ నెల 26న విధుల్లో చేరిన దినేశ్ వర్మ మానసిక ఆందోళన కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినోద్ పోర్సే (29) అనే జవాన్ ఆదివారం ఉదయం వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.