Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఢిల్లీలో రైతాంగ పోరాటంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధాన్ని, దమనకాండను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. రైతాంగ పోరాటానికి మద్దతుగా ఈనెల 3న దేశవ్యాప్తంగా గంటపాటు రాస్తారోకోలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం ఆన్‌లైన్‌లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 3 నుంచి 10 వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. వారికి ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. రైతు పోరాటాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునే దాకా పోరాటం చేయాలన్నారు. ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లతో నిరసనను చేపట్టాలని సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో సీఎం కేసీఆర్ కలిసి రావాలని కోరారు. వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తున్నదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు, నిర్బంధం ప్రయోగించినా ఢిల్లీలో రైతాంగ పోరాటం సమరశీలంగా జరిగిందన్నారు. ఢిల్లీలో చలితీవ్రత ఎక్కువగా ఉన్నా అమానవీయంగా రైతులపై పోలీసులు వాటర్‌కేనన్‌లు ఉపయోగించారని విమర్శించారు. గతనెల 26న కార్మికుల సమ్మె, 26,27 తేదీల్లో జరిగిన గ్రామీణ బంద్‌లో కార్మికులు, కర్షకులు ఏకతాటి మీదికి వచ్చి ఆర్థిక కోర్కెల కోసం కాకుండా రాజకీయ డిమాండ్లు పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచారని గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించాలన్న డిమాండ్‌తోపాటు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరాటం చేశారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంభించినా, ఉద్యోగాలు కల్పించకపోయినా, ధరలు తగ్గించకపోయినా, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మినా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారని అన్నారు. పాకిస్తాన్ వ్యతిరేక, మతోన్మాద ఎజెండాతో బీజేపీ గెలుస్తున్నదని వివరించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, నిరుద్యోగం, ఆహార భద్రత, పేదరికం వంటి అంశాలపై బీజేపీ ఎప్పుడూ దృష్టి కేంద్రీకరించలేదని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన వీర్ సావర్కర్, హెగ్డేవర్ ఉన్న కాలంలోనూ గుళ్లు కట్టం, మసీదులు కూల్చడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉన్మాదాన్ని పెంచడంపైనే దృష్టి సారించారని గుర్తు చేశారు. దేశభక్తి, జాతీయత, మతోన్మాదం పెంచి 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిచిందని చెప్పారు. గెలిచాక అభివృద్ధి, ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై కాకుండా ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం నిర్మాణం, త్రిపుల్ తలాక్, దళితులు, క్రిస్టియన్లపై దాడులు, లవ్ జీహాద్ వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించిందని వివ రించారు. అంతర్జాతీయంగా నయాఉదారవాద విధా నాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. ఆర్థికాభివృద్ధి ఆగితే ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుందని చెప్పారు. పిల్లల చదువులు, వైద్యం, జీవనం ఇలా అనేక సమస్యలు ముందుకొచ్చినపుడు ఆర్థిక జీవితం చిన్నాభిన్నం అయినపుడు ప్రజలు రోడ్లపైకి వస్తారని అన్నారు. మతోన్మాద ఎజెండా కొంత వరకే పనిచేస్తుందనీ చెప్పారు. వ్యవసాయం ప్రమాదంలో పడుతుందన్న అభిప్రాయంతో రైతులు పెద్దఎత్తున కదిలారని వివరించారు. నయా ఉదారవాద విధానాలను నికరంగా వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టుల పట్ల ఆదరణ పెరుగుతుందని అన్నారు.