Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు నేతలకు, జర్నలిస్టులకు ఎన్‌ఐఏ నోటీసులు
- తీవ్రంగా ఖండించిన ఏఐకేఎస్
- కొనసాగుతున్న రైతు ఆందోళన
- 52 రోజుకు చేరుకున్న ఉద్యమం
- మహారాష్ట్రలో భారీ ఆందోళనలకు పిలుపు
- చట్టాలకు ఐఎంఎఫ్ మద్దతు ఇవ్వడంపై రైతు సంఘాల ఆగ్రహం
న్యూఢిల్లీ : చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, వాటిని ప్రసారం చేస్తున్న జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నది. జాతీయ దర్యాప్తు సంస్థలను ఊసిగొల్పి, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నది. అందులో భాగంగానే ఎన్‌ఐఏ దాడుల పరంపర కొనసాగిస్తున్నది. ఇప్పటివరకు 12 మంది రైతు నేతలకు ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. ప్రదీప్ సింగ్, నోబెల్జిత్ సింగ్, కర్నైల్ సింగ్, దీప్ సిద్దూ, బల్దేవ్ సింగ్ సిర్సా తదితర రైతు నేతలకు ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. కేటీవీ సీనియర్ జర్నలిస్టు జశ్వీర్‌సింగ్‌కు ఎన్‌ఐఏ నోటీసులు ఇచ్చింది. ఈ జర్నలిస్టు తొలి నుంవి రైతు చట్టాలపై విస్తతంగా కవర్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ కుట్ర చర్యలను ప్రసారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతీకార చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు రైతు నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘూ వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా, తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఎఐకెఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా తీవ్రంగా ఖండించారు.
కొనసాగుతున్న రైతు ఆందోళన
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం
కొనసాగుతున్నది. రైతుల ఆందోళన శనివారం నాటికి 52వ రోజుకు చేరుకుంది. వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా వేలాది మంది రైతులు వచ్చి ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు. కొత్తగా మరో ముగ్గురు రైతులు మరణించారు. రైతు వ్యతిరేక చట్టాలకు ఐఎంఎఫ్ మద్దతు ఇవ్వడాన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బీకేయూ (ఉగ్రహాన్) నేత జోగేంద్ర సింగ్ మాట్లాడుతూ జనవరి 19న ఐఎంఎఫ్ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపు ఇచ్చారు.
మహారాష్ట్రలో భారీ ఆందోళనలకు పిలుపు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్రలో భారీ ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. జనవరి 23న ట్రాక్టర్, వెహికల్ ''రైతుల కోసం ముంబయి'' మార్చ్, జనవరి 24 ముంబయిలోని ఆజాద్ మైదానంలో భారీ దీక్షలు, జనవరి 25న రాజ్ భవన్‌కు భారీ రైతు, కార్మికుల మార్చ్, జనవరి 26న రిపబ్లిక్ డే ఫ్లాగ్ హౌస్టింగ్లు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సంయుక్త కిసాన్ మోర్చా జనవరి 23 నుండి 26 వరకు పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి, దేశవ్యాప్తంగా విస్తతం చేయడానికి పిలుపునిచ్చింది. మహా వికాస్‌అఘాడి ప్రభుత్వం తరపున ఈ పోరాటానికి సహకరించాలని రైతు సంఘాలు అభ్యర్థించాయి. రైతు పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని, శరద్ పవార్, బాలాసాహెబ్ తోరత్, ఆదిత్య ఠాక్రే మార్చి 25న రాజ్ భవన్‌కు మార్చ్ లో పాల్గొనడానికి అంగీకరించారని ఎఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే తెలిపారు.