Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు దేశవ్యాప్తంగా 1,91,181 మందికి పంపిణీ
- వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- రాష్ట్రంలో 400 కేంద్రాల్లో 3962 మందికి టీకా
- వ్యాక్సిన్ వేసుకున్నా..... 42 రోజుల తర్వాతే రక్షణ
- అప్పటి వరకు జాగ్రత్తలు తప్పవు
నవతెలంగాణబ్యూరో-న్యూఢిల్లీ, హైదరాబాద్
కరోనా వైరస్‌కు విరుగుడుకు టీకాలు ఎప్పుడు వస్తాయని దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్న తరుణంలో వ్యాక్సిన్ డ్రైవ్ శనివారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా శనివారం ఉదయం 10:30 గంటలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో.. ఒక్కో సెంటర్‌లో 100 మందికి చొప్పున వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు. తొలివిడతలో భాగంగా తొలిరోజు 1,91,181 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు పొందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తొలివిడతలో మూడు కోట్ల మందికి, రెండో విడతలో 30 కోట్ల మంది దేశ ప్రజలకు టీకా ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది తర్వాత 50 ఏండ్లు పైబడిన, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.కాగా, శనివారం ప్రారంభమైన వాక్సినేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వ యాంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. వాక్సిన్ తీసుకోనున్న వారి ఫోన్లకు అధికారులు ముందుగానే మెసెజ్‌లు పంపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరోనా పోరులో గతేడాది ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే వ్యాక్సిన్ తొలి హక్కుదారులని మోడీ అన్నారు. వ్యాక్సిన్ల తయారీ కోసం చాలా మంది అవిశ్రాంతంగా శ్రమించారని తెలిపారు. కరోనా టీకా తయారీలో సైంటిస్టుల సేవలు ఎనలేనివని కొనియాడారు. శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయనీ, త్వరలోనే మరిన్ని వ్యాక్సిన్లు కూడా తీసుకురానున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరని శాస్త్రవేత్తలు సూచించారనీ, రెండో డోసును మర్చిపోవద్దని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు చూపిన ధైర్యాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలనీ, టీకా వేసుకున్నప్పటికీ.. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. విదేశీ వ్యాక్సిన్ల కంటే దేశీయ వ్యాక్సిన్లే అతి తక్కువ ధరకు లభిస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ జగ్రత్తలు మరవొద్దని సూచించారు. ''కరోనా మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతోమంది తల్లుల కడుపుకోతకు కారణమైంది'' అని అన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఖచ్చితంగా వేసుకోవాలన్నారు. రెండో డోసు వేసుకున్న తర్వాతనే.. కరోనాకు వ్యతిరేకంగా మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. టీకా వేసుకున్న తరువాత కూడా మాస్క్, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. 'సొంత లాభం కొంత మానుకో.. పొరుగు వారికి తోడ్పడవోరు.. దేశం అంటే మట్టి కాదోరు.. దేశం అంటే మనుషులోరు.. తెలుగులో మహాకవి గురజాడ అప్పారావు చెప్పారు. గురజాడ చెప్పినట్లు పరుల కోసం మనందరం పాటుపడాలి.' అని అన్నారు.
తొలి టీకా ఇక్కడే...ఈయనకే
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సమక్షంలో తొలి టీకా వేశారు. కరోనాపై పోరులో ముందున్న పారిశుద్ధ్య కార్మికుల్లో ఒకరైన మనీష్ కుమార్‌కు తొలి టీకా ఇచ్చారు. అనంతరం రణ్‌దీప్ గులేరియా, నిటి ఆయోగ్ సభ్యుడు వి.కె పాల్ సైతం వ్యాక్సిన్ వేయించుకున్నారు. తరువాత ముందుగా నిర్ణయించిన ప్రకారం.. వరుసగా ఇతర పారిశుద్ధ్య కార్మికులకు టీకా వేశారు.
రెండు టీకాలు ఉపయోగించిన 11 రాష్ట్రాలు !
దేశంలో తాజాగా ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ మొత్తం 3,351 సెషన్లలో కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం అత్యవసరానికి అనుమతించిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు టీకాలను 11 రాష్ట్రాలు ఉపయోగించాయని తెలిపింది. వాటిలో అసోం, బీహార్, ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. ఇక కోవిషీల్డ్ మాత్రమే ఉపయోగించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్, చంఢగీఢ్, దాద్రానగర్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మణిపూర్, నాగాలాండ్, పుదుచ్చేరి, బెంగాల్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లు ఉన్నాయి. కరోనా కట్టడి కోసం దేశంలో శనివారం ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచలోనే అతిపెద్ద టీకా కార్యక్రమమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. నిటి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. టీకాపై అనుమానాలొద్దని అన్నారు. కోవాగ్జిన్‌కు తుది దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని తెలిపారు.అలాగే, ఫైజర్, మోడెర్నా సంస్థల టీకాలు సైతం మూడో దశ ట్రయల్స్‌లో ఉన్నాయని తెలిపారు.
ఉచితంగా టీకాలు ఇవ్వాలి
పేద ప్రజలకు ఉచితంగా కరోనా టీకాను అందించాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు.
దేశంలో 116 న్యూ స్ట్రెయిన్ కేసులు
యూకేలో వెగులుచేసిన న్యూ స్ట్రెయిన్ కరోనా కేసులు భారత్‌లోనూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఈ రకం కేసులు 116 నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వైరస్ బారినపడిన వారిని ప్రత్యేక రూముల్లో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు తెలిపింది.