Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: లేహ్‌లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) ఆస్పత్రిలో మొత్తం 20 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ టీకాను అందించారు. ఈ 20 మంది ఆరోగ్య సిబ్బందిలో 17 మంది పారామెడికల్ సిబ్బంది, ముగ్గురు వైద్యులు ఉన్నారు. కాగా, లడక్ ఐటీబీపీ సెక్టార్ ఆస్పత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ శర్మ.. ఆ ప్రాంతంలో కోవిడ్-19 వ్యాప్తి కట్టడిలో కీలక పాత్ర పోషించారు. లేV్‌ాలోని ఉన్న 50 పడకల ఈ ఆస్పత్రిలో దాదాపు 300 మందికి పైగా భద్రతా సిబ్బందికి చికిత్సను అందించారు. ఇందులో జీరో మరణాలను నమోదుచేయడం గమనార్హం. సరిహద్దులో ఉన్న ఈ ఆస్పత్రి.. సైనికులకు వైద్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక శనివారం దేశవ్యాప్తంగా కరోనా టీకా అందుకున్న వారిలో డాక్టర్ శర్మ కూడా ఒకరు. టీకా తీసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''మొదటి రోజే టీకా తీసుకున్న వారిలో నేను ఒకరిగా ఉండటం నాకు సంతోషంగా ఉంది. గతేడాది చాలా కఠినంగా గడిచింది. నేను భయాందోళనకు గురయ్యాను. అయితే, టీకాను తీసుకురావడంలో ప్రభుత్వ కృషికి గర్వపడుతున్నాం'' అని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకైతే ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని తెలిపారు. టీకా ఇవ్వడానికి సమ్మతి పత్రం లాంటిదేదీ ఇవ్వలేదని ఆమె తెలిపారు. షాట్ తీసుకున్న తర్వాత తనకు ఎలాంటి ప్రతికూల లక్షణాలేవి కలగలేదని ఐటీబీపీ ఆస్పత్రి అసిస్టెంట్ కమాండెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్కల్జాంగ్ ఆంగ్మో తెలిపారు. టీకా ఇచ్చిన అనంతరం 40 నిమిషాల పాటు పరిశీలనలో ఉన్నామనీ, రెండో డోసు ఫిబ్రవరి 16 మళ్లీ ఇవ్వనున్నారని తెలిపారు.