Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 48 శాతం పెరిగిన పన్నుల రాబడి
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ సమయంలో జీవనోపాధి దెబ్బతిని ప్రజలు నానా అవస్థలు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పెట్రో పన్నుల రాబడి అమాంతంగా 48 శాతం పెరిగింది. 2019 సంవత్సరంలో ఏప్రిల్, నవంబర్ నెలల మధ్య కాలంలో ఎక్సైజ్ సుంకం ద్వారా ప్రభుత్వానికి రూ.1,32,899 కోట్లు రాగా, 2020లో ఇదే కాలవ్యవధిలో 48 శాతం పెరిగి రూ.1,96,342 కోట్లు వసూలైందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఆకౌంట్స్ (సీజీఏ) తాజా గణాంకాలు పేర్కొన్నాయి. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్‌లపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అసాధారణ రీతిలో పన్నుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. అసలే కరోనా, అనాలోచితంగా, ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా విధించిన లాక్‌డౌన్ల వల్ల ఉపాధి కోల్పోయి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే, పెట్రో ఉత్పత్తులపై మోడీ ప్రభుత్వం పన్నులు పెంచుకుంటూ పోతున్నది. లీటర్ పెట్రోల్ ధర నేడు 93 రూపాయలకు చేరుకుంది. ఈ నెలాఖరుకు వంద రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ జరుగుతున్నది. డీజిల్ ధర కూడా అసాధారణ రీతిలో పెరిగిపోతున్నది. వంట గ్యాస్ సిలిండర్ నెల రోజుల వ్యవధిలోనే వంద రూపాయలు పెరిగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తులపై భారీగా పన్నులు విధించే దేశంగా భారత్ ఇప్పటికే రికార్డుకెక్కింది. 2019 ఏప్రిల్, నవంబర్ మధ్య 8 నెలల కాలంలో 5.54 కోట్ల టన్నుల డీజిల్ అమ్మకం కాగా, 2020లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్, ఇతర ఆంక్షల కారణంగా దాదాపు కోటి టన్నులు తక్కువగా 4.49 కోట్ల టన్నుల డీజిల్ సేల్ అయింది. మరోవైపు ఇదే కాలంలో 2020లో 30 లక్షల టన్నుల మేర తక్కువగా పెట్రోల్ అమ్మకాలు జరిగాయని పెట్రోలియం అండ్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) గణాం కాలు తెలిపాయి. గతేడాది మార్చి, మే మధ్య కాలంలో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్‌లపై పన్నులు విధించడంతో ఎక్సైజ్ సుంకం వసూళ్లలో భారీ పెరుగుదల నమోదైందని ఇండిస్టీ వర్గాలు ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయినా రిటైల్ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు పైపైకి ఎగబాకడానికి ఈ పన్నుల పెంపుదలే కారణం. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16లను రెండు విడతలుగా పెంపుదల చేసింది. దీంతో పెట్రోల్, డీజిల్‌లపై ఉన్న ఎక్సైజ్ సుంకం వరుసగా రూ.32.98, రూ.31.83కు చేరింది. మోడీ ప్రధానిగా బాథ్యతలు చేపట్టే 2014 నాటికి పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాలు లీటర్‌కు రూ.9.48, రూ.3.56గా ఉండేవి.