Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలోని బారాబంకీలో మృతదేహం గుర్తింపు
- వేడెక్కిన రాజకీయం
లక్నో: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అరాచకాలకు అంతేలేకుండాపోతున్నది. పెత్తందార్ల చేతుల్లో బడుగుబతుకులు నలిగిపోతున్నాయి. తాజాగా యూపీలోని బారాబంకీ ప్రాంతంలో ఓ దళిత యువతి మృతదేహం లభ్యమైంది. లైంగికదాడికి పాల్పడి హత్యచేసి మృతదేహాన్ని పొలంలో పడేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ హత్యపై రాజకీయం వేడెక్కింది. బారాబంకీ జిల్లాలోని జైద్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ దారుణం జరిగినట్టు గుర్తించారు. బీవీపూర్‌లోని పొలంలో 22 ఏండ్ల దళిత యువతి మృతదేహాన్ని గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేశారని పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి డాగ్‌స్క్వాడ్‌ను దింపారు.
ఆ యువతిపై జరిగిన దారుణానికి నిరసనగా గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దళిత కుటుంబాలకు యోగి సర్కార్‌లో రక్షణలేదంటూ నినాదాలు చేశారు.ఐజీ రెంజ్ డాక్టర్ సంజీవ్ గుప్తా మాట్లాడుతూ ఆ యువతి మృతదేహంపై ఎలాంటి దుస్తుల్లేవనీ, ఈ దారుణానికి పాల్పడింది ఒక్కడేనా.. లేక సామూహిక లైంగికదాడా.. అనే పోస్ట్‌మార్టంలో తేలుతుం దన్నారు. నిందితులను పట్టుకోవటానికి ఐదు టీములను నియమించినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రతిపక్షపార్టీల బృందం పరామర్శించింది. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని బృంద సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా,ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.