Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచన
న్యూఢిల్లీ : దేశంలో బర్డ్‌ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో భారత ఆహార భద్రత, ప్రామాణికాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కొన్ని వివరణలతో కూడిన సూచనలు జారీ చేసింది. హాఫ్ బాయిల్డ్ గుడ్లను, సరిగా ఉడకని చికెన్‌ను తీసుకోవద్దని ప్రజలకు సూచించింది. అయితే బర్డ్‌ఫ్లూపై భయపడాల్సిన అవసరం లేదనీ, కానీ చిన్నపాటి జాగ్రత్తలు మాత్రం తప్పనిసరని వినియోగదారులను, ఆహార పరిశ్రమలను కోరింది. మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టుగా సురక్షితంగా మాంసం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌ఘర్, పంజాబ్‌ల్లో పౌల్ట్రీ కోళ్లలో బర్డ్‌ఫ్లూ వున్నట్టు ధృవీకరణ అయింది. సెప్టెంబరు-మార్చి మధ్య కాలంలో భారతదేశానికి వలస వచ్చే పక్షుల నుండే ప్రధానంగా ఈ బర్డ్‌ఫ్లూ విస్తరించిందని భావిస్తున్నారు.
రిటైల్ మాంస దుకాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ కోరింది. మాంసాన్ని పూర్తిగా వండడం వల్ల వైరస్ చచ్చిపోతుందని, అందువల్ల సగం ఉడకబెట్టిన లేదా సరిగా ఉడకని మాంసాన్ని తీసుకోవద్దని సూచించింది.