Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ప్రతిపాదనకు రైతు సంఘాల నిరాకరణ
- చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందే
- ఢిల్లీలోనే కిసాన్ పరేడ్
- పోలీసులకు తెగేసి చెప్పిన నేతలు
- దేశవ్యాప్తంగా కవాతులు.. కదులుతున్న అన్నదాతలు
- 57వ రోజు కొనసాగిన ఆందోళన
- పది రైతు సంఘాలతో సుప్రీం కమిటీ భేటీ
న్యూఢిల్లీ : ఏడాదన్నర పాటు సాగు చట్టాల అమలును నిలిపివేస్తామని పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. బుధవారం జరిగిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై గురువారం సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఢిల్లీలోని సింఘు సరిహద్దులో సమావేశమయ్యారు. రైతు ఉద్యమంలో ఇప్పటి వరకు అమరులైన 147 మంది రైతులకు సంయుక్త కిసాన్ మోర్చా నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే, పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగే చర్చల్లో తమ నిర్ణయాన్ని కేంద్ర మంత్రులకు రైతు సంఘాల నేతలు వివరించనున్నారు. చర్చలు మధ్యాహ్నం 12 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభమవుతాయి.
స్థాన మార్పు లేదు..
ఢిల్లీలోనే కిసాన్ పరేడ్ నిర్వహిస్తామని, అందులో స్థాన మార్పుకు అవకాశం లేదని రైతుసంఘాల నేతలు స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతం సింఘు వద్ద రైతు సంఘాల నేతలతో ఢిల్లీ పోలీసులు చర్చలు జరిపారు. కిసాన్ రిపబ్లిక్ పరేడ్ రూట్ మార్చాలని కోరారు. అందుకు రైతు సంఘాలనేతలు ససేమిరా అన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు బదులుగా కుండ్లి-మానేసర్-పాల్వాల్ (కేఎమ్‌పీ) ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలని పోలీసు అధికారులు సూచించారు. దానిని రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. పోలీసులతో సమావేశానికి హాజరైన రైతు నాయకుడు మాట్లాడుతూ ''మా ర్యాలీని ఢిల్లీ వెలుపల చేపట్టాలని కేంద్రప్రభుత్వం కోరుతుంది. కాని మేము దానిని ఢిల్లీ లోపల నిర్వహించాలనుకుంటున్నాము. నేటి సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు'' అని అన్నారు. స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్రయాదవ్ మాట్లాడుతూ ''మేము కిసాన్ పరేడ్‌ను శాంతియుతంగా ఢిల్లీ లోపల చేస్తాము. ఢిల్లీ వెలుపల ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలని వారు కోరుకుంటున్నారు. అది సాధ్యం కాదు'' అని అన్నారు. ఇలా వుండగా, రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా శాంతియుత నడుస్త్తున్నది. కర్నాటకలోని అనేక చోట్ల ట్రాక్టర్స్ ర్యాలీల ద్వారా రైతులు గణతంత్ర దినోత్సవానికి సిద్ధం అవుతున్నారు. కేరళలో చాలా చోట్ల రైతు ట్రాక్టర్ కవాతులు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బిలాస్‌పూర్, రాంపూర్‌లలో రైతు ట్రాక్టర్ కవాతులు నిర్వహించారు. ఢిల్లీలో రైతు కవాతుకు సిద్ధమవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రైతులు జనవరి 23న రాజ్ భవన్‌ను చుట్టుముట్టనున్నారు. ఒక బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఒడిశా నుంచి నడిచిన నవ నిర్మాణ్ కిసాన్ సంగథన్ రైతులు ఢిల్లీ చలో యాత్రను ఉత్తర ప్రదేశ్ పోలీసులు పదేపదే వేధిస్తున్నారు. మజ్దూర్ కిసాన్ శక్తి సంగథన్ నాయకత్వంలో రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు షాజహన్‌పూర్ సరిహద్దుకు చేరుకున్నారు. నయా
ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తోలుబొమ్మలు, పాటలతో వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పశ్చిమబెంగాల్‌లో మహాపడావ్
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా పశ్చిమ బెంగాల్‌లోని కొల్‌కత్తాలో మహా పడావ్ నిర్వహించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాపడావ్ గురువారం కలకత్తాలో ప్రారంభమైంది. ఏఐకేఎస్‌సీసీ నాయకత్వంలో జరుగుతున్న ఈ మహాపడవ్ వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొంటున్నారు. రాణి రష్మోని రోడ్‌లో జరిగిన బహిరంగ సభలో ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావాలే, జై కిసాన్ ఆందోళన్ నాయకుడు యోగేంద్ర యాదవ్, ఏఐకేఎస్‌సీసీ బెంగాల్ కన్వీనర్ అమల్ హల్దార్, బెంగాల్ కార్యదర్శి కార్తీక్ పాల్, వర్కింగ్ గ్రూప్ కార్యదర్శి అవిక్‌సాహా సహా పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు కేంద్రప్రభుత్వ వైఖరి తీరుపై మండిపడ్డారు. ప్రధాని మోడీ అంబానీ, అదానీల నేతృత్వంలోని కార్పొరేట్ లాబీ ముందు లొంగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలోని టీిఎంసి ప్రభుత్వ అవకాశవాద, రైతు వ్యతిరేక విధానాలపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. జనవరి 26న ఢిల్లీలో జరగబోయే కిసాన్ రిపబ్లిక్ పరేడ్‌కు సంఘీభావంగా పశ్చిమ బెంగాల్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ట్రాక్టర్స్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
పది రైతు సంఘాలతో సుప్రీం కమిటీ భేటీ..
కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు నియమించిన కమిటీ గురు వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపుల ప్రక్రియను ప్రారం భించింది. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన పది రైతు సంఘాలతో చర్చిం చింది. కమిటీ సభ్యులతో చర్చల్లో కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహా రాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పది రైతు సంఘాలు పాల్గొన్నాయని కమిటీ తెలిపింది. ''రైతు సంఘాలు ఈ చర్చలో పాల్గొన్నాయి. చట్టాల అమలును మెరుగుపరచడానికి సూచనలతో సహా వారి స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేశాయి'' అని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే చర్చల్లో పాల్గొన్న ఒక్క రైతు సంఘం కూడా రైతు ఆందోళనల్లో భాగస్వామ్యం కాకపోవడం గమనార్హం.
57 రోజు కొనసాగిన రైతు ఆందోళన
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతున్నది. కొత్తగా అనేక మంది రైతులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు.