Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుణే: సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదం కారణంగా రూ. 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు కంపెనీ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. 1వ టెర్మినల్ గేట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన కారణంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కొవిషీల్డ్ సరఫరాకు ఎలాంటి ఆటంకం జరగలేదని ఆయన అన్నారు. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ''అగ్ని ప్రమాదం కారణంగా కోవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడలేదు. వాస్తవానికి వ్యాక్సిన్ తయారవుతున్నది అక్కడ కాదు. ఈ ప్రమాదం కారణంగా కంపెనీకి రూ. 1000 కోట్లకు పైగా నష్టం జరిగింది..'' అని పూనావాలా వెల్లడించారు. కాగా సీరం సంస్థలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించామని సీఎం ఉద్ధవ్ థాకరే తెలిపారు. ఇది ప్రమాదమా లేక ఏదైనా కుట్ర జరిగిందా అన్నది దర్యాప్తు తర్వాత తెలుస్తుందని ఆయన అన్నారు. పుణెలోని మంజరీ ప్రాంతంలో ఉన్న సీరం ప్రాంగణంలో నిర్మాణ దశలో ఉన్న ఓ భవనంలో నిన్న పెద్దఎత్తున మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.