Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశభక్తిపై ఇతరులకు సర్టిఫికెట్లు ఇస్తున్నవారి నిజ స్వరూపం బయటపడింది : మోడీ సర్కార్‌పై సోనియాగాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్‌చీఫ్ ఆర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్‌పై కేంద్రం మౌనం పాటించటాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తిపై ఇతరులకు సర్టిఫికెట్లు ఇస్తున్నవారి నిజ స్వరూపాన్ని 'ఆర్నాబ్ వాట్సాప్ చాట్' బయటపెట్టిందని ఆమె విమర్శించారు. శుక్రవారం సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ, ఆర్నబ్ వాట్సాప్ చాట్‌పై ఇంత గొడవ జరుగుతున్నా..మోడీ సర్కార్ మాత్రం స్పందించటం లేదన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విపరీతమైన మౌనం పాటిస్తోందని, ఆ మౌనంతో తమ చెవులు బద్దలవుతున్నాయని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ భద్రతలాంటి కీలకమైన అంశంలో ప్రభుత్వం రాజీపడిందని ఆరోపించారు.
''జాతీయ భద్రత విషయంలో కేంద్రం ఎంత రాజీపడిందో ఈ మధ్యే భయంకరమైన రిపోర్టులు బయటికొచ్చాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను బహిరంగపరిస్తే అది దేశద్రోహమని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ కొన్ని రోజుల క్రితమే చెప్పారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. విపరీతమైన మౌనం పాటిస్తోంది'' అని సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయత, దేశభక్తి మీద ఎవరైతే ఇతరులకు సర్టిఫికెట్లను జారీచేస్తున్నారో, వారి నిజస్వరూపం బట్టబయలైందని సోనియా వ్యాఖ్యానించారు.
సంచలనం సృష్టిస్తున్న ఆర్నాబ్ వాట్సాప్ చాట్
టీవీ రేటింగ్స్ కేసులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామిపై ముంబయి పోలీసులు విచారణ జరుపుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆర్నాబ్‌కు సంబంధించి మరొక సంచలన విషయం బయటపడింది. అదేంటంటే..బాలాకోట్ వైమానిక దాడులు జరగడానికి మూడు రోజుల ముందుగానే ఆ సమాచారం ఆర్నాబ్ గోస్వామికి చేరటం. ఈ విషయాన్ని వాట్సాప్‌లో 'బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్' మాజీ సీఈఓ పార్థో దాస్‌గుప్తాకు ఆర్నాబ్ పంపాడు. 'ఇది మామూలు వైమానిక దాడి కాదు..అంతకన్నా చాలా పెద్దది' అని ఒక వాట్సాప్ సందేశాన్ని ఆర్నాబ్ పంపాడు. జాతి భద్రతకు సంబంధించిన అత్యంతక కీలకమైన బాలాకోట్ వైమానిక దాడుల సమాచారం ఆర్నాబ్ గోస్వామికి మూడు రోజుల ముందు తెలియటం, ప్రధాని మోడీ సహా బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆర్నాబ్ చెప్పుకోవటం వాట్సాప్ చాట్‌లలో ఉంది. దేశ రక్షణకు సంబంధించి కీలక సమాచారం ఆర్నాబ్‌కు ఎలా చేరిందన్నదానిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదు. కేంద్రం స్పందించటం లేదు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ సంగతిపై మోడీ సర్కార్ మౌనం పాటిస్తోంది.