Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్‌వాడీలు, హెల్పర్ల దేశవ్యాప్త ఆందోళన
- కనీస వేతనం, సామాజిక భద్రత, పింఛను కల్పించాలని డిమాండ్
న్యూఢిల్లీ : ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్(ఐసీడీఎస్)పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై అంగవాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రోడ్డెక్కారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు, తమకు కనీస వేతనాలు ఇవ్వడంతో పాటు సామాజిక భద్రత, పింఛను సదుపాయం కల్పించేందుకు రానున్న 2021-22 బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు నిధులు కేటాయింపును పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్) ఆధ్వర్యాన శుక్రవారం నాడున దేశవ్యాప్త ఆందోళనలు జరిగాయి. తెలంగాణ, అసోం, బీహార్, చత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జమ్ముకాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జిల్లా స్థాయిల్లో జరిగిన ఆందోళనల్లో భారీయెత్తున అంగన్‌వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు. ఆందోళనలను విజయవంతం చేసినందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ శుభాకాంక్షలు తెలిపింది. ఐసీడీఎస్‌కు నిధుల కేటాయింపును పెంచకుంటే మరోమారు దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
2014 నుంచి ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ సర్కార్ నిధుల కేటాయింపులో కోత విధిస్తున్నదనీ, ప్రయివేటీకరణ దిశగా వెళ్లిందని అంగన్‌వాడీలు విమర్శించారు. 2014-19 మధ్య సమయంలో చిన్నారుల్లో పోషకాహార లోపం పెరిగిందని ఇటీవ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) పేర్కొందని చెప్పారు. కరోనా మహమ్మారితో పరిస్థితులు ఉద్యోగాలు, ఆదాయం కోల్పోయి పరిస్థితులు మరింత దిగజారాయనీ, భారత్‌లో రానున్న ఆరు నెలల్లో అదనంగా ఐదేళ్ల లోపు ఉన్న దాదాపు 3 లక్షల మంది చిన్నారులు పేదరికం, ఆకలి, పోషకాహార లోపంతో చనిపోయే ప్రమాదం ఉందని యూనిసెఫ్ హెచ్చరించిందని గుర్తుచేశారు. ఈ సమయంలో కూడా ఐసీడీఎస్‌కు అధిక నిధులు కేటాయించి, బాధ్యతగా ప్రవర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదని విమర్శించారు. కోవిడ్ విధుల్లో ఉన్న తమకు కనీస వేతనాలు, రక్షణ సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం అంగన్‌వాడీలు, హెల్పర్ల జీవితాలను ప్రమాదంలో నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలు, హెల్పర్ల సమస్యలు, పలు డిమాండ్లపై ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ ప్రధాన కార్యదర్శి ఎఆర్.సింధు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, తదితర నేతలతో కూడిన బృందం గురువారం నాడు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసింది. ఐసీడీఎస్ ప్రయివేటీకరణ, పాఠశాలల పున:ప్రారంభం, అధిక పని, వేతన బకాయిలు, కొన్ని నెలలుగా ఆగిన ఇతర సదుపాయాలను నేతలు మంత్రి దృష్టికి తీసుకొచ్చి, పరిష్కరించాలని కోరారు.