Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు పోరాటం యథాతథం
- 18 నెలల ప్రతిపాదనను మించింది లేదు : తోమర్
- చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిందే : రైతుసంఘాలు
- శాంతియుతంగా 26న కిసాన్ పరేడ్
- తదుపరి చర్చలపై సందిగ్ధం
కేంద్రంతో 11 సార్లు రైతు ప్రతినిధుల బృందం చర్చలు జరిగాయి. మొత్తం మీద 45 గంటలకు పైగా భేటీ అయినా సాగు వ్యతిరేకచట్టాలపై నాన్చుడు ధోరణినే కేంద్రం ప్రదర్శించింది. 11వ సారీ ఫలితం రాలేదు. చర్చలు అర్థంతరంగా ముగిశాయి. సుమారు రెండు నెలలకు పైగా సాగదీసిన మోడీ సర్కార్..సుప్రీం కోర్టుపైనే భారమేసి తప్పించుకునే మార్గాలు వెతికింది. కానీ ఆ పప్పులు ఉడకలేదు. ఏడాదికిపైగా చట్టాలను ఆపుతామంటూ పదోసారి జరిగిన చర్చలో కేంద్రం ముందుకొచ్చింది. ఇలా మోడీ వేసిన వ్యూహాన్ని రైతు సంఘాలు తిప్పికొట్టాయి. చివరగా శుక్రవారం జరిగిన చర్చల్లో...ఇక మేం ఏం చేయలేమంటూ కేంద్రమంత్రులు నరేంద్రతోమర్, పీయూశ్ గోయల్ మొండి చేయిచూపారు. మరోవైపు కిసాన్ పరేడ్‌కు దేశవ్యాప్తంగా బయలుదేరిన ట్రాక్టర్లు ఢిల్లీ సరిహద్దులకు చేరటానికి కొద్ది రోజులే మిగిలిఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ ఆందోళన కార్యాచరణను యథాతథంగా కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక విజ్ఞాన్‌భవన్‌లో రైతు సంఘాల నేతలతో కేంద్రప్రభుత్వం జరిపిన 11వ విడత చర్చలు విఫలమయ్యాయి. ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి చర్చలకు సంబంధించి తేదీ ఖరారు చేయకుండానే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన చర్చల ప్రక్రియ సాయంత్రం 5:30 గంటలకు ముగిసింది. ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్, కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోంప్రకాశ్ హాజరవ్వగా, 40 మంది రైతుసంఘాల నేతలు పాల్గొన్నారు. హన్నన్ మొల్లా (ఏఐకేఎస్), గుర్నామ్ సింగ్ (బీకేయూ), శివ కుమార్ (మధ్యప్రదేశ్), మేజర్ సింగ్ పునివాలా (ఏఐకేఎస్, పంజాబ్), దర్శన్ పాల్, జగ్‌మోహన్ సింగ్, సత్‌నామ్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాలా, జగ్‌జీత్ సింగ్ దళ్లేవాల్, కవితా కూరగంటి, రాకేష్ తికాయత్, హర్బల్ సింగ్, అంచావతా, అభిమన్యుకుహర్ తదితర నేతలు హాజరయ్యారు. ఐదున్నర గంటల పాటు చర్చలు జరిగినట్టు ప్రభుత్వం చెబుతున్నా.. మధ్యలో ఒకసారి విరామం మినహాయిస్తే అరగంటసేపు మాత్రమే చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి తోమర్ చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశామని, 18 నెలల పాటు ఈ చట్టాల అమలును నిలిపివేసే ప్రతిపాదనను మించింది ఏదీ లేదన్నారు. దీనిపై రైతులు నిర్ణయం తీసుకోలే దన్నారు. రైతుల నిర్ణయం చెబితే మళ్లీ చర్చించేందుకు సిద్ధమని పునరుద్ఘాటించారు. అయితే కేంద్ర ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘాల నేతలు కేంద్ర
మంత్రులకు తెలిపారు. మరోవైపు, 10 నిమిషాల కన్నా మించి చర్చలు జరగలేదని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. తదుపరి చర్చలు కొనసాగుతాయని కూడా తాము అనుకోవడంలేద న్నారు. తాము మాత్రం ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. కొన్ని గంటల తరువాత మళ్లీ కేంద్ర మంత్రులు వచ్చి ఇంతకన్నా మంచి ప్రతిపాదనలు చేయలేమని చెప్పారని, మాట్లాడుకొని వచ్చి చెబితే తదుపరి సమావేశానికి తేదీ ఖరారు చేస్తామని చెప్పారన్నారు. రిపబ్లిక్‌డే రోజున తలపెట్టిన పరేడ్ కోసం పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఆరోజు శాంతియుతంగా పరేడ్ నిర్వహిస్తామన్నారు.
విజయవంతం కాలేదు : దర్శన్‌పాల్
రైతు సంఘం నేత దర్శన్ పాల్ సింగ్ మాట్లాడుతూ ''చర్చలు విజయవంతం కాలేదు. తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుందో తమకు తెలియదు. దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనల్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జనవరి 26న పరేడ్ రూట్ మ్యాప్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులతో మాట్లాడుతున్నాము. ఒకటి, రెండు రోజుల్లో ఖరారు అవుతుంది. ఢిల్లీకి సమీప ప్రజలు జనవరి 26న జరిగే పరేడ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో మేము విజయం సాధిస్తాం'' అన్నారు. చట్టాలు రద్దు చేస్తే మోడీ ప్రతిష్ట దిగజారుతుందని భావిస్తున్నారని ఏఐకేఏస్సీసీ సభ్యురాలు కవితా కురగంటి అన్నారు.
పాత ప్రతిపాదనలే : హన్నన్ మొల్లా
కేంద్ర ప్రభుత్వం పాత ప్రతిపాదనతోనే చర్చలకు వచ్చిందని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అన్నారు. చర్చల్లో ఎటువంటి ఫలితమూ రాలేదని అన్నారు. రైతు సంఘాలన్ని సమావేశం అయ్యి చర్చించి, భవిష్యత్తు కార్యచరణ నిర్ణయిస్తామని చెప్పారు.