Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రానున్న మూడు రోజుల పాటు వాయువ్య భారత్ ను చలి మంచు, తేలికపాటి వర్షాలు కమ్మేయనున్నాయి. పంజాబ్, హర్యానా, చండీఘర్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. జనవరి 24 నుండి 27 వరకు పంజాబ్.. హర్యానాలను పొగ మంచు కమ్మేయనుందని హెచ్చరించింది. అదేవిధంగా జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలనూ శనివారం హిమపాతం ముంచెత్తనుందని తెలిపింది. తూర్పు ఆప్ఘనిస్తాన్‌తో పాటు పొరుగు దేశాల్లో చలిగాలులు తీవ్రత పెరగడంతో పాటు మధ్య పాకిస్తాన్‌లో తీవ్ర గాలులు వీస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో జమ్ము కాశ్మీర్, లఢఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మెరుపులతో కూడిన వర్షాలు, వడగండ్లు పడే అవకాశాలతో పాటు చలి దుప్పటి కప్పే అవకాశాలున్నాయని తెలిపింది. రానున్న 48 గంటల్లో ఉష్ణోగ్రతలు పెరిగి....24 తర్వాత 3-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వాయువ్య, మధ్య భారత్‌లో తీవ్రంగా చలి పెరుగుతుందని ముందస్తు హెచ్చరికలు చేసింది. రాబోయే ఐదు రోజుల్లో యుపి, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురల్లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు ఉంటుందని తెలిపింది.