Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ కల్పన పెంచేలా బడ్జెట్ ఉండాలి : నిపుణులు సూచన
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని.. వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2021-22నకు సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిరుద్యోగ సంక్షోభానికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేశంలో 2020 డిసెంబర్‌లో నిరుద్యోగిత రేటు 9.06 శాతానికి ఎగిసి.. ఆరే నెలల గరిష్ట స్థాయికి చేరిందని ముంబయి కేంద్రంగా పని చేస్తోన్న సెంటర్ ఫర్ మానిటరీంగ్ ఇండియన్ ఎకానమీ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. వీరంతా ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొంది.
2018 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నోట్ల రద్దు, ఇటీవల కరోనా నియంత్రణకు సరైన ప్రణాళికలు లేకుండా అమలు చేసిన లాక్‌డౌన్ నిబంధనలు, జిఎస్‌టి లాంటి సంస్కరణలు దేశ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూలతలను పెంచిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో లక్షలాది మంది ఉద్యోగాలు పోవడంతో పాటుగా కొత్త వారికి ఉపాధి మరీ క్లిష్టంగా మారింది. దీంతో దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోందనే ఆందోళనలు నెలకొన్నాయి. లాక్‌డౌన్ కాలంలో అయితే పట్టణాల్లో రోజు కూలి చేసుకునే కోటి మంది పైగా ఉపాధి కోల్పోవడం, ఆకలితో కాలునడకన సొంత ఊళ్లకు ప్రయాణం చేసిన ఘటనలు అనేక మందికి కన్నీళ్లు పెట్టించాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వీరందరికీ ఉపాధి దొరికే పరిస్థితి లేదు. గ్రామీణ కార్మికులకు ఉపాధి తగ్గిపోవడంతో దేశంలో నిరుద్యోగం మరింత పెరుగుతోందని శివ్ నాడర్ యూనివర్శిటీ ఎకనామిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ పార్థ చటర్జీ ఇది వరకు పేర్కొన్నారు. అలాగని వాళ్ళంతా పట్టణాలకు తిరిగి వచ్చిన ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో సీజనల్ పనులు కూడా అయిపోవడంతో వచ్చే మాసాల్లో వలస కార్మికులు భారీగా పెరగనున్నారని.. దీంతో ఇక్కడ నిరుద్యోగం మరింత హెచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ప్రభుత్వం వ్యయాలు పెంచడం, నిర్మాణ, మౌలిక వసతుల రంగాల్లోని కార్మికులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడానికి వీలుందని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎం గోవింద రావు సూచించారు.
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ప్రియం..!
వచ్చే బడ్జెట్‌లో రిఫ్రిజిరేటర్లు, ఎసిలు, స్మార్ట్‌ఫోన్లు సహా పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, గహోపకరణాలు సహా దాదాపు 50కి పైగా వస్తువులపై కేంద్రం దిగుమతి సుంకాన్ని 5 నుంచి 10 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈ సుంకాల పెంపు ద్వారా ప్రభుత్వం అదనంగా రూ .20,000 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకోవాలని యోచిస్తోంది. ఇందుకోసం ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన రంగాల ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని భావిస్తోంది. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలు ఎంతమేర పెరుగుతాయనే దానిపై అధికారులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.