Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని ముంబాయిలో భారీ రైతుర్యాలీ జరిగింది. అంతకు ముందు ఏఐకేఎస్ నేతృత్వంలో వేలాది మంది రైతులు నాసిక్, థానే జిల్లాలతో పాటు 21జిల్లాల నుంచి అయోధ్య మైదానానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ రైతు ర్యాలీ వేదికగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. ఇలాంటి గవర్నర్‌ను మహారాష్ట్రలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ''మీరు (రైతులు) గవర్నర్‌ను కలిసి మెమొరాండం సమర్పించడానికి వెళ్తున్నారు. ఆయనకేమో కంగన (రనౌత్)ను కలిసేందుకు సమయం ఉంది కానీ రైతులను కలిసేందుకు లేదు. స్వయంగా వచ్చి మిమ్మల్ని (రైతులను) కలవాల్సిన నైతిక బాధ్యత గవర్నర్‌కు ఉంది'' అని పవార్ అన్నారు. రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా వాళ్ల సమస్యలేమిటని ప్రధాని ఒక్కసారైనా విచారించారా? రైతులేమైనా పాకిస్థాన్ వాళ్లా? అని కూడా ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో వ్యవసాయ చట్టాలు ఆమోదించే ముందు ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని, కనీసం బిల్లులపై చర్చ కూడా జరపలేదని పవార్ అన్నారు.
అందుబాటులో లేని గవర్నర్..! : బహిరంగ సభ అనంతరం రైతులు రాజ్‌భవన్‌కు మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అపా యింట్‌మెంట్ కూడా ఇచ్చారు. కాని గవర్నర్ హఠాత్తుగా గోవా ప్రయాణానికి వెళ్లారు.
మార్చి 1న పార్లమెంట్ మార్చ్ : మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మార్చి 1న పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది.