Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జార్ఖండ్ సీఎంపై లైంగికఆరోపణలు చేసిన మహిళ ఫిర్యాదుపై బాంబే హైకోర్టు
ముంబయి : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై లైంగికదాడి ఆరోపణలు చేసిన మహిళ తన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. తనకు, తన కుటుంబసభ్యులకు తగిన భద్రత కల్పించడంతోపాటు, లైంగికదాడి ఆరోపణల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా బాంద్రా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ముంబయిలోని ఒక హోటల్లో సోరన్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమె 2013లో స్థానిక మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించింది. అదే సంవత్సరం తనకు వివాహం కుదిరినందున పిల్‌ను ఉపసంహరించుకుంటానని పేర్కొంటూ బాంద్రా కోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేయగా, అందుకు న్యాయస్థానం అనుమతించింది. గుజరాత్ వెళ్తుండగా తనకు రోడ్డు ప్రమాదం జరిగిందని, దీని వెనుక సోరెన్ ఉన్నారని ఆరోపిస్తూ.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ మహిళ గతేడాది ఆగస్టులో బాంబే హైకోర్టును తిరిగి ఆశ్రయించింది. మళ్లీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని పేర్కొంటూ మహిళ తరపున న్యాయవాదులు సోమవారం బాంబే హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ఎస్‌ఎస్.షిండే, మనీష్ పితాలేలతో కూడిన ధర్మాసనం అందుకు తిరస్కరించింది. మహిళ చేసిన అభ్యర్థనను ఈ దశలో అనుమతించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. ఈ కేసులో జోక్యం చేసుకుంటూ పిటిషన్లు దాఖలు చేసిన జార్ఖండ్‌కు చెందిన మాజీ జర్నలిస్టు సునీల్ కుమార్ తివారీ, స్త్రీ రోషిణి ట్రస్టు తరపు న్యాయవాదులు కేసును ఉపసంహరించుకునేందుకు మహిళకు అనుమతి ఇవ్వొద్దని కోరాయి.
దీంతో ఈ కేసు విచారణను బాంబే హైకోర్టు వచ్చే నెల 18కి వాయిదా వేసింది.