Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ చట్టాల రద్దే ప్రస్తుత సమస్యకు ఏకైక పరిష్కారమనిసిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆయన మంగళవారం ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ, ప్రస్తు పరిస్థితికి మోడీ ప్రభుత్వమే కారణమన్నారు. ఏ రూపంలోనైనా హింస అనేది దేనికీ సమాధానం కాదని ఏచూరి స్పష్టం చేశారు. 'పరిష్కరించాల్సిన సమస్య ప్రభుత్వం చేతిలోనే ఉంది. పరిష్కారం అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది. అది చట్టాలను రద్దు చేయడమే' అని పేర్కొన్నారు. 'రైతులపై బాష్పవాయువు ప్రయోగం, లాఠీఛార్జి చేయడం దారుణం. ఇలా చేసే పనైతే సంయుక్త కిసాన్ మోర్చా, ఢిల్లీ పోలీసుల మధ్య చర్చలు ఎందుకు నిర్వహించినట్లు? ప్రభుత్వం గొడవను ఎందుకు రేకెత్తిస్తోంది?' అని ఏచూరి ప్రశ్నించారు. ఈ గణతంత్ర దేశం ప్రజల కోసమే ఉన్నదని, ప్రజలు లేకుండా గణతంత్ర మౌలిక స్వరూపానికే అర్థం లేదని ఏచూరి అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కోట్లాది మంది రైతుల చట్టబద్ధమైన డిమాండ్ కోసం ఈ ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. రైతులను ఢిల్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో వారు 60 రోజులకు పైగా తీవ్ర చలిలో పోరాటం సాగిస్తున్నారని, వంద మందికిపైగా రైతులు అసువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కులను అడిగే వారిపై కాషాయ మూకలు దుర్భాషలాడుతున్నారని, కేంద్ర మంత్రులు క్రూరమైన ఆరోపణలు చేస్తున్నారని, న్యాయాధికారులు కోర్టుల్లో ప్రాతిపదిక లేకుండా వాదనలు వినిపిస్తారని అన్నారు. మన రైతులు కోరుతున్న చట్టబద్ధమైన డిమాండ్లకు పరిష్కారం చూపే మార్గం ఇది కాదని ఏచూరి బిజెపి ప్రభుత్వానికి హితవు పలికారు.