Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వ్యాక్సినేషన్'పై 60 శాతం మంది ప్రజలు సందిగ్ధం
- టీకా వల్ల ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చన్న 59 శాతం మంది
- 'లోకల్ సర్కిల్స్' తాజా సర్వేలో ఆసక్తికరమైన విషయాలు
- ప్రభుత్వం ప్రజల అనుమానాల్ని నివత్తి చేయాలి: సామాజిక కార్యకర్తలు
స్రవంతి:
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థల సౌజన్యంతో పుణెలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివద్ధి చేసిన ''కొవిషీల్డ్'', హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివద్ధి చేసిన ''కొవాగ్జిన్'' టీకాలను ప్రస్తుతం కరోనా యోధులైన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బందికి వేస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ఈ టీకా కార్యక్రమం విస్తరించనున్నది. అయితే వ్యాక్సిన్ ను వేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? వాళ్ల మనసులో ఏమున్నది? అని తెలుసుకోవడానికి ''లోకల్ సర్కిల్స్'' ఆన్ లైన్ వేదిక తాజాగా ఓ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 213 జిల్లాల్లో 17 వేల మందిపై సోమవారం నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
పదిలో ఆరుగురు ఆయోమయంలోనే
సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడానికి సిద్ధంగా లేమని, వ్యాక్సినేషన్ పై ఆలోచించుకోవడానికి ఇంకొంత సమయం కావాలని చెప్పారు. టీకాలను వేసుకోవడంపై ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నామని 55 శాతం మంది ఆరోగ్య సిబ్బంది పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని 4 శాతం మంది తెలిపారు. మరో మూడు నెలల తర్వాత టీకా వేసుకోవడంపై ఆలోచిస్తామని 28 శాతం మంది, 3 నుంచి 6 నెలల దాకా వేచి చూస్తామని 16 శాతం మంది, 6 నుంచి 12 నెలల దాకా వేచి చూస్తామని 7 శాతం మంది, మరో ఏడాది తర్వాత వ్యాక్సిన్ వేసుకోవడంపై ఆలోచిస్తామని 3 శాతం మంది తేల్చి చెప్పారు. కాగా వ్యాక్సిన్ సమర్థత, ఇతరత్రా విషయాలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అనుమానాల్ని వెంటనే నివత్తి చేయాలని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఆలోచించడానికి ప్రజలు చెప్పిన కారణాలు ఇవే
- వ్యాక్సిన్ వేసుకుంటే ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చని 59 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
- టీకా సమర్థతపై 14 శాతం మంది అనుమానాలు వ్యక్తం చేశారు.
- టీకా తీసుకున్న వాళ్లు అనారోగ్యానికి గురైనట్టు/మరణించినట్టు మీడియాలో వస్తున్న వార్తలు భయపెడుతున్నాయని 19 శాతం మంది పేర్కొన్నారు.
- మరికొద్ది రోజుల్లో కరోనా పూర్తిగా పోతుంది.. కాబట్టి వ్యాక్సిన్ అవసరంలేదని 4 శాతం మంది తెలిపారు.
- కొత్త రకం కరోనాపై వ్యాక్సిన్ పని చేస్తుందో లేదో తెలియదు. అలాంటప్పుడు టీకా వేసుకొని లాభం ఏంటని 4 శాతం మంది ప్రశ్నించారు.