Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ అల్లర్ల వెనుక ఉన్న అసాంఘిక శక్తులు ఎవరు..?
- రైతు ఉద్యమాన్ని నీరుగార్చేలా కుట్ర : ఏఐకేఎస్ ప్రధానకార్యదర్శి హన్నన్‌మొల్లా
న్యూఢిల్లీ : ఢిల్లీలో కిసాన్‌పరేడ్ సందర్భంగా జరిగిన ఘటన దురదృష్ట కరమని ఏఐకేఎస్ ప్రధానకార్యదర్శి హన్నన్ మొల్లా అన్నారు. దేశ రాజధాని లో ఉద్రిక్తతపై అందరూ సంయమనం పాటించాలని కోరారు. దేశప్రజల్లో వీపరీతార్ధాలు రాకుండా మీడియా పాత్రవహించాలని సూచించారు. రైతుల ఆందోళనల్ని బదనాం చేయకుండా గురుతర బాధ్యత నిర్వర్తించాల్సిన సమయమిదని చెప్పారు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో మంగళవారం ఆయన
మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు శాంతియుత నిరసనలు చేస్తూనే ఉన్నారనీ, మోడీ సర్కార్ తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఏడు నెలల నుంచి బీజేపీ తెచ్చిన ఆ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. గత రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దులో జీరో డిగ్రీల చలిలోనూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విష యాన్ని ఆయన గుర్తుచేశారు. 150మందికి పైగా రైతులు చనిపో యారు. పరేడ్‌ను పోలీసులు ఎక్కడ ఆపితే అక్కడే ఆగిపోవాలని అన్నదాతలకు సూచించామన్నారు. దేశవిదేశాల్లోనూ రైతు ఉద్యమం గురించి చర్చనీయాంశమైందనీ, వందేండ్లలో ఎన్నడూ చూడనివిధంగా ఆందోళన చేస్తున్నారని ప్రశంసించారని ఆయన తెలిపారు. అయితే ఈ ఉద్యమాన్ని బదనాం చేసే ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. ఈ ఆందోళల్లో బయటి శక్తులు ప్రవేశిస్తాయని కేంద్రం చెబుతున్నా... తాము మాత్రం చట్టాల రద్దుకోసం శాంతియుతంగా ఆందోళన కొనసా గించాలని నిర్ణయించామని వివరించారు. పరేడ్ అశాంతి నెలకొంటే దానివల్ల మోడీ ప్రభుత్వానికే ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని విశదీకరించామన్నారు. పరేడ్ నీడలోకి అంసాఘిక శక్తులు చొరబడే అవకాశాలున్నాయని ముందుగానే పోలీసులకు తెలియజేశామనీ, వారిని అడ్డుకోవటానికి వలంటీర్లను నియమించామన్నారు. దేశవ్యా ప్తంగా 700 జిల్లాలు, రాష్ట్ర రాజధానుల్లోనూ శాంతియుత నిరసనలు జరిగాయనీ, తమ హక్కులకు ఏవిధంగా భంగం కలుగుతున్నదో దేశప్రజలకు తెలియజేయటానికి రైతులంతా రోడ్లపైకి వచ్చారన్నారు. ఢిల్లీ అల్లర్లలో చొరబడ్డ అసాంఘిక శక్తులు రైతులకు వ్యతిరేకులేననీ, ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఏడునెలల నుంచి అన్నదాతలు ఆందోళనలు చేస్తుంటే మోడీ సర్కార్ చొరవ తీసుకో కుండా.. సమస్యను మరింత జఠిలం చేసిందన్నారు. ప్రధానే స్వయం గా జోక్యం చేసుకుని ఉంటే... ఇలాంటి ఘటనలు జరిగే ఆస్కారం ఉండేది కాదన్నారు. ఎర్రకోట వద్ద కొందరు జెండా ఎగురవేస్తున్నా... పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. ఢిల్లీ ఖాకీలు ఎందుకు అడ్డుకోలేదు.? కేంద్రం, అసాంఘిక శక్తులతో కలిసి ఉండటం వల్లే ఢిల్లీ రగలటానికి కారణమైఉండొచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లోనూ అన్నదాతల హక్కులకోసం పోరాటాలు చేస్తామన్నారు.