Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చారిత్రాత్మక ట్రాక్టర్ పరేడ్
- టియర్ గ్యాస్.. లాఠీచార్జ్
- పోలీసుల దాడిలో రైతు మృతి
- ఢిల్లీలో అడుగు పెట్టిన రైతులు
- అపూర్వం : సంయుక్త కిసాన్ మోర్చా
- ఇంటర్నెట్, మెట్రో సేవలు నిలిపివేత
స్వాతాంత్య్రనంతర చరిత్రలో అపూర్వ ఘట్టానికి దేశ రాజధాని వేదికైంది. 63 రోజుల సుదీర్ఘ ఆందోళన తరువాత హస్తినలో రైతాంగం కదం తొక్కింది. గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్లతో పరేడ్ చేసింది. బండెన్క బండి కట్టి అన్నట్టు ఒకదాని తరువాత ఒకటిగా వస్తున్న ట్రాక్టర్లను, వాటిని నడిపిస్తున్న అన్నదాతలను చూసి ఢిల్లీ నగరం జై కిసాన్ అంటూ నినదించింది! పులకరించి పూల వర్షం కురిపించింది. దానికి బదులుగా జై జవాన్ అని రైతులు స్పందించారు. దీంతో జై జవాన్-జై కిసాన్ అన్న నినాదం మార్మోగింది. కార్పొరేట్లకు దోచిపెట్టేలా మోడీ ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తాయి. అదే సమయంలో రైతాంగ ఆందోళనపై మోడీ సర్కారు కుటిల నీతి మరోమారు బట్టబయలైంది. లక్ష ట్రాక్టర్లతో పరేడ్ చేస్తామని చెబుతున్న రైతులకు అనుమతిచ్చినట్టే ఇచ్చి చివరి క్షణంలో ఐదు వేల ట్రాక్టర్లే అంటూ మెలిక పెట్టింది. చర్చోపచర్చల అనంతరం ప్రారంభమైన పరేడ్‌కు అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. పై నుంచి అందిన ఆదేశాలతో బండరాళ్లను, బస్సులను, భారీ కంటైనర్లను ట్రాక్టర్లకు అడ్డుగా పోలీసులు ఉంచారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వీటిని దాటుకుని ముందుకు సాగిన రైతులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. బాష్పవాయువు ప్రయోగించారు! ఫలితం..నవనీత్ సింగ్ అనే రైతు ప్రాణత్యాగం! అయినా, రైతులు ముందుకు సాగారు! అయితే, తొలి నుంచి రైతు సంఘాలు అనుమానిస్తున్నట్లుగానే శాంతియుతంగా సాగుతున్న ప్రదర్శనలోకి అవాంఛనీయ శక్తులు ప్రవేశించాయి. అపశ్రుతులకు కారణమయ్యాయి, సింఘూ సరిహద్దు నుంచి నిర్దేశించిన సమయానికన్నా ముందుగానే బయలు దేరిన కొందరు అనుమతిచ్చిన మార్గాన్ని వదిలి ఎర్రకోట వైపు దూసుకువెళ్లారు. ప్రారంభంలో అడుగడుగునా విరుచుకుపడిన పోలీసులు ఈ ఘటన జరుగుతున్నంత సేపూ ప్రేక్షక పాత్ర పోషించడం గమనార్హం! ఈఘటనల తరువాత ఢిల్లీ నగరంలో ఇంటర్‌నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. పరేడ్‌లో చోటుచేసుకున్న అపశ్రుతులపై రైతు సంఘాలు విచారం వ్యక్తంచేశాయి. నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం శాంతియతంగా కొనసాగుతుందని ప్రకటించాయి. రైతులపై పోలీసులు చేసిన దాడిన వామపక్షాలు ఖండించాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా రైతులు చేపట్టిన ఆందోళనలో ఒక చారిత్రాత్మక ఘట్టం నెలకొంది. మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా చారిత్రాత్మక ''కిసాన్ రిపబ్లిక్ పరేడ్'' జరిగింది. మొత్తం ఆరు సరిహద్దు ప్రాంతాల్లో ప్రారంభమైన పరేడ్ చెదురుముదురు ఘటనలు మినహా మొత్తంగా విజయవంతంగా జరిగింది. దాదాపు 300 కిలో మీటర్ల మేర సాగిన పరేడ్ కొన్ని చోట్ల మినహా దాదాపుగా శాంతియుతంగా జరిగింది. దీంతో 63 రోజుల ఆందోళన అనంతరం తొలిసారి రైతులు ఢిల్లీలో అడుగుపెట్టారు. కొన్నిచోట్ల పోలీసులకు,
రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రైతులపై పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఒక రైతు మృతిచెందాడు. ఎర్రకోటపై జాతీయ జెండాలు, రైతు సంఘాల జెండాలు ఆవిష్కరించారు. ఇండియా గేట్‌కు సమీపంలోకి రైతుల పరేడ్ చేరుకుంది. అక్కడ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు అక్కడే బైటాయించారు.
పరేడ్ సాగిందిలా..
కిసాన్ రిపబ్లిక్ పరేడ్ ఆరు సరిహద్దు ప్రాంతాల్లో జరిగింది. షాజహాన్‌పూర్ సరిహద్దులో ప్రారంభమైన కిసాన్ పరేడ్ బావల్, మనేసర్ మీదుగా సాగి మళ్ళీ షాజహాన్‌పూర్‌కు చేరుకుంది. మేహావాట్ రూట్ లో సున్హేడా జూర్హేడా బోర్డర్ లో ప్రారంభమైన పునహానా, పిన్గ్వాన్, బాడకలి, నూహా, బిడపూర్ చౌక్, ఉటవాడ మూడ్, కోట్ మీదుగా సాగి మళ్ళీ పునహానాకు చేరుకుంది. చిల్లా బోర్డర్ రూట్‌లో చిల్లా బోర్డర్ లో ప్రారంభమై క్రిలోవన్ ప్లాజా రెడ్ లైట్, డిఎన్ డి ప్లైవే, మెయిన్ దాద్రీ రోడ్డు, దాద్రీ రోడ్డు మీదుగా పరేడ్ సాగి చిల్లా బోర్డర్ లో ముగిసింది. ఈ మూడు ప్రాంతాల్లో ప్రశాంతంగా పరేడ్ జరిగింది.
రైతులపై విరుచుకుపడ్డ పోలీసులు
అయితే సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ ప్రాంతాల నుంచి ప్రారంభమైన పరేడ్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తొలుత సహకరిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు, బారికేడ్లను తొలగించకపోయేసరికి రైతులు కోపోద్రిక్తులు అయ్యారు. ఎంత చెప్పినప్పటికీ పోలీసులు బారికేడ్లను తొలగించలేదు. రైతులు రెండు మూడుసార్లు తొలగించకపోతే నెట్టుకొని ముందుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో రైతులు బారికేడ్లను నెట్టుకుంటూ ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. రైతులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ట్రాక్టర్లు ముందుకు సాగకుండా ట్రాక్టర్లు నడుపుతున్న వారిపై పోలీసులు ప్రతాపం చూపించారు. సింఘు నుంచి ముందుకు సాగిన కిసాన్ పరేడ్‌పై సంజరు గాంధీ ఆటో నగర్ వద్ద పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే టిక్రీ నుంచి ప్రారంభమైన పరేడ్‌కు తొలినుంచి పోలీసులు సహకరించలేదు. పోలీసులు బారికేడ్లు తొలగించకపోయేసరికి, రైతులే బారికేడ్లను నెట్టుకుంటూ ముందుకు సాగారు. ఘాజీపూర్ వద్ద ప్రారంభమైన పరేడ్ అనుకున్న రూట్లో కాకుండా దారి మళ్లించడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
రాజ్‌పథ్ వైపుగా రైతులు
దేశ రాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటు న్నాయి. ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ సరిహద్దు ఘాజీపూర్ వద్ద ప్రారంభమైన కిసాన్‌పరేడ్ అనుకున్న దారిలో కాకుండా వేరే దారిలో పయనించింది. దీంతో భద్రతా దళాలకు, రైతులకు తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఘాజీపూర్ నుంచి ఆనంద్ విహార్ వెళ్లేందుకు దారి మళ్లింపు వద్ద మొదట బారికేడ్ ను నెట్టుకుంటూ ముందుకు సాగింది. ఆ తరువాత పాండవ నగర్ (అక్షరధామ్) వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను, సరైఖలేఖాన్ వద్ద మూడోసారి బారికేడ్లను పక్కకు నెట్టి ముందుకు సాగారు. ఆ తరువాత ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా రైతులు పక్కకు పడేశారు. అలా ముందుకు సాగిన కిసాన్ పరేడ్ సుప్రీం కోర్టు, ఇండియా గేట్, జన్‌పథ్‌కు వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జ్ (ఐటిఓ) వద్ద పోలీసులు రైతులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆనంద్ విహార్ (అక్షరధామ్) వద్ద రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మళ్లీ ఐటిఓ వద్ద బాష్పవాయు గోళాలతో పాటు లాఠీ ఛార్జ్ ప్రయోగించారు. శారదా నగర్‌లోని చింతామని చౌక్ వద్ద స్వల్ప లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ మార్గంలో పలుచోట్ల ట్రాక్టర్లు వెళ్లకుండా బస్సులను పోలీసులు అడ్డుగా ఉంచారు. దీంతో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు ధ్వంసం అయ్యాయి. కొన్ని బస్సులను ట్రాక్టర్లతోనే పక్కకు నెట్టారు. నంగ్లోరు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ట్రాక్టర్లపై వస్తున్న అన్నదాతలపై భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు వారిని చెదరగొట్టారు. రైతులపై పోలీసులు చేసిన దాడిని రైతు సంఘాల నేతలు ఖండించారు.
ఎర్రకోట వద్ద రైతన్న జెండా
సింఘు సరిహద్దు నుంచి ఉదయం తమ ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించిన వేలాది మంది రైతులు కూడా మధ్యాహ్నం నాటికి ఎర్రకోట సముదాయంలోకి వెళ్లారు. ఎర్రకోట బురుజులపైకి ఎక్కిన రైతులు అక్కడే జాతీయ జెండాలు, రైతు సంఘాలు ఎగుర వేశారు.అయితే వారి చర్యలతో ఏఐకేఎస్సీసీతో సంబంధం లేదని నాయకులు ప్రకటించారు.
రైతు మృతి
పోలీసుల చర్యల వల్ల నవనీత్ సింగ్ అనే రైతు మృతి చెందాడు. మృతదేహంతో రైతులు ఆందోళన చేపట్టారు. పోలీసుల లాఠీఛార్జి వల్లే అతడు చనిపోయాడని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, దీన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు.
ఇంటర్నెట్, టెలికాం, మెట్రో సర్వీసులు నిలిపివేత
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కేంద్రం ఇంటర్నెట్, టెలికాం, మెట్రో సేవలను నిలిపి వేశారు. రాత్రి 12గంటల వరకు టెలికాం, ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా సింఘు, టిక్రీ, ఘాజీపూర్, ముఖుర్దాచౌక్, నగ్లోరు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. మరోవైపు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. తొలుత ఐటిఓ మెట్రో స్టేషన్ ప్రవేశ, నిష్క్రమణ గేట్లు మాత్రమే మూసివేసిన అధికారులు.. ఆ తరువాత జామా మసీద్, దిల్షద్ గార్డెన్, జిల్మిల్, మానసరోవర్ పార్కు, ఇంద్రప్రస్థ తదితర స్టేషన్లను మూసివేశారు. సమయపూర్, రోహిణి సెక్టర్, హైదర్పూర్, జహంగీర్ పూర్, ఆదర్శనగర్, అజర్పూర్, బడ్లీ మోర్, మోడల్ టౌన్, జిటిబి నగర్, విశ్వవిద్యాలయ, విధానసభ, సివిల్ వైపు తదితర మెట్రో స్టేషన్లను మూసివేశారు.
పార్లమెంటు, రాజ్‌పథ్ వైపు వెళ్లే మార్గాలు మూసివేత
పార్లమెంట్, విజరు చౌక్, రాజ్‌పథ్, ఇండియా గేట్ వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. కొన్ని ప్రధాన మార్గాలు మూసివేయడంతో ఇతర మార్గాల్లో భారీగా రద్దీ నెలకొంది. డ్రోన్ కెమెరాలతో ర్యాలీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా..
మరోవైపు ర్యాలీలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు మంగళవారం ఉదయానికే ట్రాక్టర్లతో ఢిల్లీకి చేరుకున్నారు. పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ నంచి భారీ సంఖ్యలో కర్షకులు తరలివచ్చారు. ప్రతి ట్రాక్టర్‌కి ముందు జాతీయ జెండాను కట్టి రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు మహిళలు, పురుషులు ట్రాక్టర్లలో తమ సంప్రదాయ రీతిలో నృత్యాలు, నాటకాలు ప్రదర్శించారు. కిసాన్ రిపబ్లిక్ పరేడ్‌కు ఘన స్వాగతం లభించింది. ఆరు ప్రాంతాల్లో ప్రారంభమైన కిసాన్ పరేడ్‌కు ఎక్కడికక్కడే ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు పూలతో స్వాగతం పలికారు.
భారీ భద్రతా దళాలు
కిసాన్ పరేడ్ నేపథ్యంలో భారీ భద్రతా దళాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, అదనపు పారామిలటరీ దళాలు మోహరించాయి. పది సిఆర్పీఎఫ్ కంపెనీలతో 15 కంపెనీల భద్రతా దళాలు పని చేస్తున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా
ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై తాజా పరిస్థితులపై అధికారులతో చర్చించారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన పరిణామాలను అధికారులు ఆయనకు వివరించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.