Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం
- రోడ్డెక్కిన రవాణా కార్మికులు
- పన్నురేట్లను యథాస్థితికి తీసుకురావాలంటూ డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలో నానాటికి పెరిగిపోతున్న పెట్రోల్, డీజీల్ ధరలు రవాణా రంగాన్ని తీవ్రం సంక్షోభంలోకి నెట్టాయి. ఈ రంగంపై ఆధారపడి జీవించే కార్మికుల జీవితాలను ఆగం చేశాయి. దీంతో ఇప్పుడు వారంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో సాధారణ, మధ్యతరగతి ప్రజలతో పాటు ప్రతి ఒక్క రంగానికి చెందిన కార్మికుడూ పెరిగిన పెట్రో ధరలకు బాధితుడిగానే మిగిలాడు. కానీ, కేంద్రం తీరులో మాత్రం ఏ మాత్రం సానుకూల స్పందన కనబడటం లేదు. దీంతో మోడీ సర్కారు తీరుపై దేశంలో రవాణా రంగానికి చెందిన కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న ఇంధన ధరల ప్రభావంతో మొత్తం రవాణా రంగమే తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఆర్. లక్ష్మయ్య అన్నారు. ఇంధన ధరల పెరుగుదలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని రోజులుగా నిరసనప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ధరలను సాధారణ ప్రజలు సైతం ఖండిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనల్లో భాగమవుతున్నారు.
''మహమ్మారి సమయంలో లీటర్ పెట్రోల్‌పై రూ. 13, డీజీల్‌పై రూ. 16 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాలపై భారాన్ని మోపుతూ, వినియోగదారుల ముక్కు పిండి మరీ కేంద్రం ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. ఫలితంగా రవాణా చార్జీలు, దీంతో నిత్యవసర ధరలు కచ్చితంగా పెరుగుతాయి'' అని లక్ష్మయ్య వివరించారు. అయితే, పెట్రోల్, డీజీల్‌లపై పన్ను రేట్లను గతేడాది మార్చి 1 నాటికి ఉన్న స్థితికి తీసుకురావాలని ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు అనేక నగరాల్లో గత కొన్ని రోజులుగా ఉబర్, ఓలా, ఇతర యాప్-ఆధారిత ట్రాన్స్‌పోర్టేషన్ కార్మికులు నిరసనలు చేస్తున్నారు. ఇంధన ధరలను అదుపులో ఉంచాలనీ, పెట్రోల్, డీజీల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. '' లాక్‌డౌన్ కాలంలో నగరంలోని దాదాపు 60శాతం మంది డ్రైవర్లు ఇంటి బాట పట్టారు. ఇప్పుడు చమురు ధరల పెరుగుదలతో అతి కష్టం మీద 40శాతం క్యాబ్‌లు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి'' అని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్‌ఏటీ) జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, రవాణా కార్మికులకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు నిరసనల్లో భాగస్వామ్యమవుతున్నాయి. వారి తరఫున గొంతెత్తి వినిపిస్తున్నాయి. '' ధరల పెరుగదలతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర కష్టాలను అనుభవిస్తున్నారు. సేవారంగం ఇంకా మహమ్మారి దెబ్బ నుంచి కోలుకోలేదు. అయితే, ఇంధన ధరలు ఆ కష్టాలను ఇంక విస్తృతం చేస్తున్నాయి'' అని ఆంధ్రప్రదేశ్ సీఐటీయూ యూనిట్ జనరల్ సెక్రెటరీ ఎం.ఏ గఫూర్ అన్నారు.