Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు ధరలు తగ్గించడంలో కేంద్రం విఫలం
- ప్రధాని మోడీ సర్కారుపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేతలు
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నడూ నమోదుకాని రీతిలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. అలాగే, గృహ అవసరాలకు ఉపయోగించుకునే ఎల్‌పీజీ సిలిండర్ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. దీంతో చమురు ధరలు భారం వాహనదారుల నడ్డి విరుస్తుండగా.. పెరిగిన సిలిండర్ ధరలు, నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజల్లో పొయ్యి వెలిగించకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో చమురు ధరలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలనీ, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ధర్మసంకట పరిస్థితి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడం పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. చమురుపై విధిస్తున్న సుంకం తగ్గించడంతో పాటు ఇంధన ధరలను అదుపుచేయడంలో మోడీ సర్కారు తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చమురుపై పన్నును తగ్గించాలని సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌తో సహ పలు ప్రతిపక్షపార్టీలు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాయి.
అంతర్జాతీయ కారణాలతోనే..: ధర్మేంద్ర ప్రధాన్
చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంపై సర్వత్రా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ''చమురు ఎగుమతి దేశాలు లాభాల కోసం ఇంధన ఉత్పత్తిని తగ్గించాయి. దీని కారణంగా డిమాండ్ పెరిగి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి'' అని పేర్కొన్నారు. అలాగే, ఇంధనంపై విధిస్తున్న పన్నులను ఆయన సమర్థించడం గమనార్హం. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా కొనాసాగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
పన్నుపోటును తగ్గించండి: సోనియా గాంధీ
ప్రజలను కష్టాల్లోకి నెట్టి ప్రభుత్వం లాభపడుతున్నదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. రాజధర్మాన్ని అనుసరించాలనీ, ఇంధనంపై పన్నుపోటును తగ్గించాలని పేర్కొంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేయడం దోపిడి కంటే దారుణమైందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకు భారాన్ని తగ్గించాలి కానీ వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేయకూడదని హితవు పలికారు. ఏడేండ్లు అధికారంలో ఉన్న మోడీ సర్కారు.. సొంత ఆర్థిక తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మునుపటి పాలకులను నిందించటం అతి దారుణమైన విషయమని పేర్కొన్నారు.
అభివృద్ధి పేరిట బీజేపీ విధ్వంసం: అఖిలేష్ యాదవ్
అటు కేంద్ర, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. అభివృద్ధి పేరిట ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ హాయంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయనీ, యూపీ సీఎం యోగి స్వస్థలమైన గోరఖ్‌పూర్ సరిహద్దులో నివసిస్తున్న ప్రజలు ఇంధనం కోసం నేపాల్ వెళ్లాల్సిన దుస్థితిని బీజేపీ సృష్టించిందని విమర్శించారు. బీజేపీ ప్రస్తుతం దేశంలోని ప్రజలను ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి మంటల్లోకి నెట్టిందని ఆరోపించారు.
ప్రజల జీవితాలు ప్రభావితం: మాయావతి
దేశంలో చమురు ధరలు పెరుగుతుండటంపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ''చమురు సహా పలు నిత్యావసరాల ధరలు పెరుగుతుండటం ఆందోళనకరం. సామాన్య ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వెంటనే ధరల పెరుగుదల సమస్యను పరిష్కరించాలి'' అని ట్వీట్ చేశారు.
మోడీ అచ్చెదిన్.. ప్రజలపై భారం మోపడమే.. :రాహుల్, ప్రియాంక
ప్రజలపై భారాన్ని మోపడమే మోడీ అచ్చెదిన్ అంటూ రాహుల్, ప్రియాంకలు ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనీ, చమురు ధరలు పెరుగుదల వారిని మరింత క్రుంగదీసిందని ఆరోపించారు. అలాగే, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చమురు ధరలు పెరగడాన్ని నిరసిస్తూ.. సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపాడు.