Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ప్రముఖ రచయిత, విరసం నేత వరవరరావు ఎట్టకేలకు ఊరట లభించింది. బీమా కొరేగావ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న వరవరరావు(82)కు బెయిలు మంజూరు చేస్తూ సోమవారం బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. 82 ఏండ్లు పైబడిన వారికి వర్తించే ఆక్టోజెనరియన్‌ను వర్తింపు చేస్తూ ఆరు నెలలపాటు బెయి లు మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలు, ఇతర వైద్య సంబంధిత అంశాల విషయంలో ఆయనకు బెయిల్ ఇచ్చినట్టు కోర్టు తెలి పింది. వరవరరావు, ఆయన భార్య పెండ్యాల హేమలత వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టి స్ మనీష్ పిటాలేలతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి1న తీర్పు రిజర్వు చేయగా దానిపై సోమ వారం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, మానవ హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగబద్ధమైన విధులు అనుసరించి ఉపశమనం ఇవ్వడానికి ఇది తగిన, వాస్తవ కేసుగా అభిప్రాయపడుతున్నట్టు తెలిపింది. ఆదేశాలు మూడు వారాల పాటు స్టే ఇవ్వాలన్న అదనపు సొలిసిటర్‌జనరల్ అనిల్ సింగ్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ''వరవరరావు వయసు, ఆరోగ్యాన్ని గుర్తించండి. ఆయన వయసు 80 సంవత్సరాలు పైగాఉంది. మీ విజ్ఞప్తులు దీనికి లోబడి ఉంటాయి'' అని ఇరు పక్షాల న్యాయవాదులనుద్దేశించి జస్టిస్ షిండే వ్యాఖ్యానించారు. ఆరునెలల బెయిల్ కాలం పూర్తయిన తర్వాత లొంగిపోవడం లేదా బెయిల్ పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.