Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్మారెడ్డికి జెపి నడ్డా హామీ
నవ తెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో ఎయిమ్స్‌స్థాపనకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందం రానుంది. ఈ కేంద్ర మంత్రి జెపి నడ్డా రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి హామీనిచ్చారు. తెలంగాణకు ఎయిమ్స్‌ను ఆమోదించాలని కోరుతూ టిఆర్‌ఎస్ ఎంపీల ఆధ్వర్యంలో లక్ష్మారెడ్డి మంగళవారం పార్లమెంట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జెపి నడ్డాను కలిశారు. ఎయిమ్స్ స్థాపనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు వందల ఎకరాలను త్వరలో కేంద్ర బృందం పరిశీలించనుంది. అనంతరం ఎయిమ్స్ స్థాపన సాధ్యసాధ్యాలపై కేంద్రానికి నివేదించనుంది. దీంతో పాటు ప్రధానమంత్రి స్వస్థ సురక్షా యోజన(పిఎంఎస్‌ఎస్‌వై) పథకంలో వరంగల్ ఎంజెఎం, ఆదిలాబాద్ రిమ్స్‌కు ఒక్కొక్క దానికి రూ. 120 కోట్లు కేటాయించాలని కోరినట్లు సమావేశనంతరం లక్ష్మారెడ్డి తెలిపారు. దీంతోపాటు ఎంఎన్‌జె కేన్సర్ ఆసుపత్రికి ఆధునీకరణకు కేంద్రం కేటాయించిన రూ.120 కోట్లనూ విడుదల చేయాలని కోరారు. అలాగే నిమ్స్ స్టెమ్ సెల్‌ప్రాజెక్టుకు కేంద్రం రూ. 25 కోట్లు కేటాయించిందని, అయితే కేవలం రూ. తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయిచిందని, మిగతా రూ. 16 కోట్లు విడుదల చేయాలని విన్నవించారు. అంతకముందు శాస్త్ర,సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కలిసి రాష్ట్రంలో ఇన్నోవేటివ్ సెంటర్లు ఏర్పాటుకు సంబంధించి రూ. 300 కోట్లు కేటాయించాలని కోరారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో టిఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, సీతారాం నాయక్, కొత్తప్రభాకర్‌రెడ్డి తదితరులున్నారు.