Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2 లక్షలు కట్టాలని ఓయూ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పక్కన చింతల్‌కుంటలో నడుస్తున్న షైన్ ఇండియా డిగ్రీ కాలేజీకి ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా సివిల్స్ కోచింగ్ నడుపుతున్న ఆ కాలేజీకి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు షైన్ ఇండియా డిగ్రీ కాలేజీ (భవిత ఎడ్యుకేషనల్ సొసైటీ) కార్యదర్శికి ఓయూ షోకాజు నోటీసు జారీ చేసింది. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేస్తున్నది. ఎల్బీనగర్ అడ్రస్‌తో ఉన్న ఈ కాలేజీ ఓయూ నుంచి తరలింపునకు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్‌పేట్‌లో మూడెకరాల స్థలంలో కళాశాలను నిర్మించి యధేచ్చగా నడుపుతున్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఓయూ అధికారులు షైన్ ఇండియా డిగ్రీ కాలేజీ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. రూ.2 లక్షలు చెల్లించి నిబంధనలు పాటించకపోతే నోటీసు ఇవ్వకుండానే ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఏఐఎస్‌ఎఫ్ పోరాటం వల్లే...
షైన్ ఇండియా డిగ్రీ కాలేజీ అక్రమాలకు సంబంధించి ఓయూ అధికారులకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశామని ఏఐఎస్‌ఎఫ్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మాసారం ప్రేమ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ పోరాటం వల్లే ఆ కాలేజీకి రూ.2 లక్షల జరిమానా విధించారని పేర్కొన్నారు.