Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, కర్షకులు సన్నద్ధం: సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హేమలత
రాజమహేంద్రవరం : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి ఎనిమిదిన జరగనున్న సార్వత్రిక సమ్మెను భారత్ బంద్ మాదిరిగా నిర్వహిస్తామని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ కె.హేమలత చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జరుగుతున్న ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తొమ్మిదో మహాసభ మూడో రోజుకు చేరుకుంది. ఈ మహాసభకు హాజరైన ఆమె మీడియాతో మంగళవారం మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన తలపెట్టిన సర్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు కార్మికులు, కర్షకులతోపాటు అంగన్‌వాడీ ఉద్యోగులు, స్కీం వర్కర్లు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. సమ్మెను జయప్రదం చేసేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక, కర్షకులను ఐక్యం చేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ఆర్థిక మాద్యంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. అనేక ప్రయివేటు కంపెనీలు సైతం సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని తెలిపారు. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారని, రానున్న అతికొద్ది కాలంలో మరో పది లక్షల మంది వరకూ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు కన్పిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ, నిర్మాణరంగం, గార్మెంట్స్, టెక్స్‌టైల్స్ వంటి రంగాల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల రోజురోజుకూ ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నదని చెప్పారు.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోకుండా, కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రూ.2.15 లక్షల కోట్ల రాయితీలను ఇచ్చిందన్నారు. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందా? అని ప్రశ్నించారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన రాయితీ సొమ్ముతో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు వీలుగా ఉత్పాదక రంగంపై పెట్టినట్టయితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో లక్షలాదిగా ఉపాధి కోల్పోతున్న కార్మికులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండోసారి అధికారంలోకొచ్చిన బీజేపీ ప్రభుత్వం రక్షణ రంగంతోపాటు, రక్షణకు సంబంధించిన ఉత్పత్తిరంగాన్ని కూడా ప్రయివేటు కంపెనీలకు అప్పగించాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేకిన్ ఇండియా అంటూనే మరోపక్క ప్రభుత్వరంగానికి ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వడంలేదన్నారు. విదేశాల నుంచి దిగుమతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ ప్రభుత్వరంగంలోని ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. రైల్వేరంగాన్ని కూడా ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేపట్టిందన్నారు.
ఇప్పటికే 150 రైళ్ల సర్వీసులను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించిందని తెలిపారు. ఆఖరికి రైల్వే స్టేషన్ల నిర్వాహణ బాధ్యత కూడా ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నదన్నారు. భవిష్యత్తులో రైల్వేశాఖ ద్వారా పేదలకు ఇచ్చే రాయితీలు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేలకు ఉన్న భూములను సైతం ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను సాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు సీఐటీయూ కార్యాచరణతో ముందుకెళుతున్నదన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను హరించేలా కార్మిక చట్టాలలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తున్నదన్నారు. కార్మిక వ్యతిరేక సవరణలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.