Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు : అమిత్ షా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)ని దేశమంతా అమలు చేస్తామని కేంద్ర హౌంమంత్రి అమిత్ షా అన్నారు. అసోంలో నిర్వహించిన ఎన్నార్సీ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లోనూ దీనిని తీసుకొస్తామని ఆయన చెప్పారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. వివిధ మతాలకు చెందినవారు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. పౌరుల జాబితాలో ప్రతిఒక్కరూ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసోంలోనూ మరోసారి ఎన్నార్సీని చేపడతామని ఆయన వివరించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత కాశ్మీర్‌లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయని తెలిపారు. కాశ్మీర్‌లో ఇంటర్‌నెట్ పునరుద్ధరణ అంశాన్ని స్థానిక అధికారులకే వదిలివేశామనీ, అక్కడ పాకిస్థాన్ తన కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో భద్రతను పరిగణనలోకి తీసుకొని ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపివేశామని షా తెలిపారు. వాటిని త్వరలోనే పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనీ, మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని ల్యాండ్‌లైన్ సేవలు అందుబాటులోని వచ్చాయనీ, అన్ని ఉర్దూ, ఆంగ్ల వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్ల కార్యకలాపాలూ కొన సాగుతున్నాయని చెప్పారు. బ్యాంకింగ్ సేవలు ప్రారంభమయ్యాయనీ, ప్రభుత్వ కార్యాల యాలు, కోర్టులు తెరుచుకున్నాయని షా తెలిపారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ జోక్యం చేసుకొని స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నప్పటికీ విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉందని అన్నారు. విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేదని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా పాకిస్థాన్ నుంచి ముప్పు ఉన్నప్పటికీ ఇప్పుడే ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారని ప్రశ్నించారు. ఇంటర్‌నెట్ లేకపోతే విద్యార్థుల చదువు ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. దీనిపై దేశప్రజల భద్రత గురించి ఆలో చించినప్పుడు కొన్ని అవసరాలను తాత్కాలికంగా పక్కనబెట్టాల్సి వస్తుందని షా సమాధానమిచ్చారు. భద్రతాపరమైన కారణాల వల్ల దేశానికి చెందిన ఎంపీల బృందాన్ని కాశ్మీర్ లోయ సందర్శించడానికి అనుమతించలేదని తెలిపారు.