Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు
- సామాజిక మాధ్యమంలో పేలుతున్న జోకులు
న్యూఢిల్లీ : దేశంలో ఉల్లి రేట్లు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ధరలను అదుపుచేయడంలో మోడీ సర్కారు ఇప్పటికే విఫలమైంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉల్లిపై చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోప్క, ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుస్తున్నారు. ఉల్లి ధరలు పెరిగిపోవడం పట్ల మోడీ సర్కారును నిలదీస్తూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నలు సంధించారు. దీనికి నిర్మలా సమాధానమిస్తూ.. ''నేను ఉల్లిపాయలు ఎక్కువగా తినను. ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తినే కుటుంబం నుంచి నేను రాలేదు'' అంటూ తన తిండి అలవాట్లను గురించి చెప్పుకొచ్చారు. దేశంలో ఉల్లి రేట్లు భారీగా పెరిగిపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు మీమ్స్‌తో జోకులు పేలుస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలు కూడా జతకావడంతో నెటిజన్లు మరింత వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ ఆమె తీరును విమర్శిస్తున్నారు.
నిర్మలా వ్యాఖ్యలకు మరో కేంద్ర మంత్రి సమర్ధన
ఇదిలా ఉండగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే.. నిర్మలా వ్యాఖ్యలను సమర్థించడం గమనార్హం. ''నేను పూర్తిగా శాకాహారిని. నేను ఉల్లి ఎప్పుడూ తినలేదు. నాలాంటి వ్యక్తికి మార్కెట్‌లో ఉల్లి పరిస్థితి గురించి ఎలా తెలుస్తుంది'' అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
ఆమె అవకాడో తింటారా? : చిదంబరం
నిర్మలా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి. చిదంబరం స్పందించారు. ఆమె(నిర్మల) ఉల్లిపాయలు కాకుండా అవకాడో తింటారా? అని వ్యంగ్యంగా అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు కేంద్రం ఆలోచనా తీరుకు అద్దం పడుతున్నదని మీడియా సమావేశంలో చిదంబరం అన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.150కి చేరినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంలో ధరలను అదుపులో పెట్టి సామాన్యులపై భారాన్ని తగ్గించాల్సిందిపోయి.. కేంద్ర మంత్రులు ఇలా నిర్లక్ష్యపూరితంగా స్పందించడం పట్ల దేశంలోని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.