Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు రక్షణ ఉంటుందా..!
- మహిళలపై దారుణాలు.. నేర కేసుల్ని ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు లోక్‌సభలో 19 మంది..
- అన్ని పార్టీల తరఫున బరిలోకి దిగిన నేరచరిత అభ్యర్థులు 88 మంది
న్యూఢిల్లీ : హైదరాబాద్ షాద్ నగర్‌లో దిశపై దారుణం..హత్య ఘటనపై పార్లమెంటులో అట్టుడికింది. గంటల తరబడి చర్చా జరిగింది. మహిళలపై దాడులకు సంబంధించి కఠిన చట్టం లేదనీ, అందరూ కలిసివస్తే మరింత కఠినమైన చట్టాలు తీసుకురావటానికి సిద్ధంగా వున్నామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. వినటానికి అంతా బాగుందనుకుందాం...కానీ దేశరాజధాని ఢిల్లీలోనే నిర్భయపై అమానుషం జరిగి ఏడేండ్ల తరువాత కూడా... ఇలాంటి స్టేట్‌మెంట్‌లను మనం వింటున్నాం. చట్టాలు చేస్తామంటున్నారు. మహిళలపై ఘోరాలు జరిగినప్పుడు గంటల కొద్దీ చర్చలు చేస్తున్నారు. మళ్ళీ షరా మామూలే... ఇది నాణేనికి ఓవైపు.. మరోవైపు మహిళలపై నేరాలకు పాల్పడిన వారు నాయకులైతే.. వారిని కాపాడేందుకు అధికారంలో ఉన్న పార్టీలు చేసిన ప్రయత్నాలు బోలెడున్నాయి. తనపై దారుణానికి పాల్పడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై కేసు పెట్టినందుకు బాధితురాలు నాన్నతో సహా సమీప బంధువులను కోల్పోవాల్సిన పరిస్థితి. బీజేపీ మాజీ ఎంపీ చిన్మయానంద్‌పై సాక్ష్యాలతో సహా బయటపెట్టిన బాధితురాలినీ జైల్లో పెట్టారు. ఆ కేంద్ర మాజీ మంత్రిపై కేసుపెట్టినా.. యోగి సర్కార్ బేఖాతరు చేసింది. చివరికి ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు ప్రకటించింది. ఇలా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కొన్ని రాజకీయ పార్టీలు కాపాడటం ఒక ఎత్తయితే.. వారికి ఎంపీ, ఎమ్మెల్యేల టిక్కెట్లు ఇచ్చి కొన్ని రాజకీయ పార్టీలు బరిలోకి దింపుతున్నాయి. నిందితులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చి పోటీలో దింపుతున్న ఆ పార్టీలే.. ఇపుడు మహిళలను బరాబర్ రక్షించాల్సిందేనని మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశమవుతున్నది. ఓటు వేసే మహాశయులారా.. ఓటే మన ఆయుధం. ఓటు వేసేముందు బరిలోకి నిలిచే ప్రజాప్రతినిధి చరిత్రను ఒకసారి పరిశీలించండి. ఆయుధాన్ని సంధించండి అని సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తిచేస్తున్నారు. అలా చేయకపోవటంవల్లనే క్రిమినల్సే లీడర్ల అవతారం ఎత్తుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లోక్‌సభకు పోటీచేసిన వారు 88 మంది
మహిళలపై నేరాలకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న 88 మంది అభ్యర్థులను గత లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు పోటీలో నిలిపాయి. ఇందులో అధికార బీజేపీ అగ్రస్థానంలో వుంది. 15 మంది క్రిమినల్స్(మహిళలపై నేర కేసులున్న)కు ఆ పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. వారిలో 10 మంది ప్రస్తుత పార్లమెంటులోని లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇలాంటి నేరచరితులున్న 9 మంది అభ్యర్థులు ఎన్నికల గోదాలో దిగగా.. ఐదుగురు గెలిచి.. కాంగ్రెస్ రెండో స్థానంలో వున్నది. మొత్తం మీద మహిళలపై నేరాలకు పాల్పడిన 88 మంది అభ్యర్థుల్లో 19 మంది లోక్‌సభలో ఎంపీలయ్యారు. వారిలో ముగ్గురిపై తీవ్రమైన లైంగికదాడి ఆరోపిత కేసులున్నాయి. పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థుల్లో 38 మందిపై కేసులున్నాయి. కాని వారందరూ ఎన్నికల్లో ఓడిపోయారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన 7,928 మంది అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ గణాంకాలను వెల్లడించింది.
అసెంబ్లీల్లోనూ అదే తీరు
గత ఐదేండ్లలో 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 40,690 మంది అభ్యర్థులు పోటీచేశారు. వీరిలో 443 మంది అభ్యర్థులపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. బీజేపీ నుంచి అత్యధికంగా 49 మంది అభ్యర్థులున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసినవారు 41 మంది. పోటీచేసిన 443 మంది అభ్యర్థుల్లో 63 మంది ఎమ్మెల్యే పదవులను అలంకరించారు. గెలిచిన వారిలో 13 మంది బీజేపీ, 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహిళలపై నేర చరిత కలిగినవారు కావటం గమనార్హ:.
పార్టీ మహిళలపై దారుణానికి పాల్పడిన
ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచినవారు
బీజేపీ 49 13
కాంగ్రెస్ 41 14
బీఎస్సీ 22 0
శివసేన 11 2
ఎస్పీ 9 0
తృణమూల్ కాంగ్రెస్ 5 5