Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నావో బాధితురాలి చివరి మాటలివే : బృందా కరత్
- హాస్పిటల్‌లో కుటుంబాన్ని కనీసం ఓదార్చేవారే లేరు
- ప్రభుత్వం నుంచి ఒక్క అధికారి రాలేదు..
- యూపీ ప్రభుత్వం తీరు దారుణం..
న్యూఢిల్లీ : ''వారికి శిక్ష పడాల్సిందే. అందుకోసమైనా నేను బతకాలి''...ఇవి 'ఉన్నావో' లైంగికదాడి బాధితురాలి చివరి మాటలు. ఉన్నావో లైంగికదాడి ఘటనలో నిందితులు బెయిల్‌పై బయటకొచ్చి, బాధిత మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఢిల్లీలోని హాస్పిటల్‌లో గురువారం రాత్రి మరణించింది. అత్యంత పాశవికమైన ఈ ఘటనతో దేశంయావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధితురాలు మృతి చెందిందన్న విషయం తెలిసి సీపీఐ(ఎం) నాయకురాలు బృందా కరత్ హాస్పిటల్‌కు వెళ్లారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. అక్కడ కుటుంబ సభ్యులున్న స్థితిని చూసి బృందా కరత్ చలించిపోయారు. యూపీ ప్రభుత్వం తరఫున ఏ ఒక్క అధికారీ వారికి అండగా నిలబడలేదనీ, కనీసం హాస్పిటల్‌కు కూడా రాలేదనీ బృందా కరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో బృందా కరత్ మాట్లాడుతూ...''కుటుంబ సభ్యుల బాధను పంచుకునే వారే లేరు. కూతుర్ని రక్షించుకునే ప్రయత్నంలో వారు ఒంటరిపోరు చేయాల్సి వచ్చింది. ఇంత ఘోరమైన ఘటన జరిగితే కేంద్రం నుంచిగానీ, యూపీ ప్రభుత్వం నుంచి గానీ ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు. వారి కన్నీరు తుడిచే బాధ్యత లేదా?'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతా అయిపోయాక...ఫాస్ట్ ట్రాక్ కోర్టా ? : బృందా కరత్
ఉన్నావో మహిళను ఒక్కసారి కాదు, రెండు సార్లు చంపారు. యూపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అత్యంత పాశవికమైన ఈ ఘటన జరిగింది. అందులో అనుమానం లేదు. యూపీ పాలకుల, పోలీసుల నిర్లక్ష్యం ఫలితం ఇది. అంతా అయిపోయాక, ఇప్పుడు కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు పంపుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు. దీంతో తమ బాధ్యత తీరిపోయినట్టుగా పాలకులు చెబుతున్నారు. తనకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ ఒంటరిపోరాటం చేసింది. నిందితులను అరెస్ట్ చేయించింది. కానీ ప్రభుత్వం ఏం చేసింది. వారిని విడిచిపెట్టి, ఆమె చావుకు కారణమైంది.