Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టికల్ 370 రద్దుకు నాలుగు నెలలు
- కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆంక్షలు..
- సామాజిక సంస్థల ర్యాలీకి
- అడ్డంకులు సృష్టించిన పోలీసులు
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి నాలుగు నెలలు గడిచింది. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను రూపుమాపేందుకు తమ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని కేంద్రంలోని బిజెపి ప్రకటించింది. కాగా, జమ్ముకాశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన హక్కును మోడీ ప్రభుత్వం కాలరాసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. స్వయంప్రతిపత్తి రద్దు సమయంలో కేంద్రం జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులైన ఫరూక్ అబ్ధుల్లా, ఒమర్ అబ్ధుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలను గృహనిర్భందం చేసిన విషయం తెలిసిందే. అనేక మంది సామాజిక ఉద్యమకారులను, సామాన్య ప్రజలను అరెస్టు చేసి ఇతర రాష్ట్రాల్లోని జైళ్లకు తరలించింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఆగస్టు 5 నుంచే నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రవాణా, ఇంటర్నెట్ సేవలను రద్దు చేసింది. కాశ్మీర్‌లోకి పలు రాజకీయ పార్టీల నేతలను అనుమతించక పోవడంతో ఆఖరుకు కోర్టు జోక్యం చేసుకోవడంతో అనుమతించాల్సిన పరిస్థితి. కాశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడుతున్నాయని, సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని కేంద్రం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏ ప్రజాస్వామ్యయుత, శాంతియుత కార్యక్రమం నిర్వహించా లనుకున్నా కూడా దానికి వందల సంఖ్యలో పోలీసు బలగాల పహారా, సవాలక్ష అడ్డంకులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.
ర్యాలీపై ఆంక్షలు
జమ్ముకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దును వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలకు చెందిన సామాజిక ఉద్యమ సంస్థలు గతనెల 26 నుంచి డిసెంబర్ 1 వరకూ ' ప్రజాస్వామ్య పునరుద్ధరణ' పేరుతో జమ్ము నుంచి కాశ్మీర్ వరకూ మార్చ్ నిర్వహించతలపెట్టాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మందికిపైగా ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ మార్చ్ జమ్ముకాశ్మీర్‌లోని ప్రెస్‌క్లబ్ నుంచి భారీ పోలీసు భద్రత నడుమ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిరసనకారులకు అధికారులు పలురకాల ఆంక్షలు విధించారు. కొంతదూరం నడిచిన తర్వాత వాహనాల్లోనే కార్యక్రమం నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఈ మార్చ్‌లో పాల్గొన్న ప్రముఖుల్లో జమ్ము కాశ్మీర్‌కు చెందిన మాజీ ఎంపీ షేక్ అబ్ధుర్ రెహమాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నేత, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన డాక్టర్ సునీలాం ఉన్నారు.
అనేక 'కార్డు'లు చూపించాల్సిన పరిస్థితి..
ఈ సందర్భంగా కాశ్మీర్‌కు చెందిన ఒక వృద్ధుడు మార్చ్ బృందంతో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తమను చాలా బాధించిందన్నారు. తాము ఇక్కడే పుట్టిపెరిగామని, ప్రస్తుతం ఇక్కడ జీవించాలంటే అనేక కార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న ఒక పోలీసు వృద్ధుడి స్టేట్‌మెంట్ వీడియో రికార్డు కాకుండా అడ్డుకున్నారు. స్థానికులతో మాట్లాడితే అరెస్టు చేస్తామని బృంద సభ్యులను పరుష పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారు. కొండచరియలు విరిగిపడ్డాయన్న నెపంతో యాత్రను ఇకపై అనుమతించబోమని అధికారులు చెప్పారని ఒకరు తెలిపారు. ఆ కొండచరియలను ఆర గంటలోనే తొలగించారని స్థానికులు చెప్పారు. తమను శ్రీనగర్‌కు తీసుకెళ్లకుండా పోలీసులు ట్యాక్సీ, బస్సు డ్రైవర్లను బెదిరించారని, అందువల్ల తాము రంబన్ జిల్లా నుంచి వెనక్కు రావాల్సి వచ్చిందని నిరసనకారుల్లో ఒకరు తెలిపారు. తాము జిల్లా సరిహద్దు దాటి వచ్చే వరకూ కూడా పోలీసుల వాహనాలు తమను అనుసరించాయని ఆయన చెప్పారు. యాత్ర మొదలైనప్పటి నుంచి అధికారులు తమను పలు విధాలుగా హింసించారని ఉద్యమకారిణి వర్ష పేర్కొన్నారు. ఎట్టకేలకు నిరసనకారుల్లో ఆరుగురు ట్యాక్సీ ద్వారా నవంబర్ 29 నాటికి శ్రీనగర్ చేరుకొని పలువురితో సమావేశం నిర్వహించారు. కేంద్ర నిర్ణయంపై ప్రజల్లో పెద్దయెత్తున ఆగ్రహం వ్యక్తమవుతోందని వారు తెలిపారు.
మీడియా సమావేశానికి అనుమతి నిరాకరణ
మొదటి రోజు సాయంత్రానికి ఉదంపూర్‌కు చేరుకున్న నిరసనకారులు కరపత్రాలు పంచి, స్థానిక మార్కెట్లో ప్రజలతో సమావేశమయ్యారు. ఆ తరువాతి రోజు ఉదయం ఒక మీడియా సమావేశం నిర్వహించాలని వారు అనుకున్నారు. ఉదయమే అక్కడకు చేరుకున్న పోలీసులు అందుకు అనుమతించలేదు. నిరసనకారులు ఉన్న ప్రాంతంలోకి కనీసం జర్నలిస్టులను కూడా అనుమతించని పరిస్థితి. దీనిపై స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకే తాము ఈ చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆ ఉత్వర్వులకు సంబంధించిన పత్రాలను చూపించాలని మీడియా డిమాండ్ చేయగా, పోలీసుల విధులకు అడ్డుతగలవద్దంటూ తప్పించుకోజూ శారు.