Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 72రూపాయలు దాటిన డీజిల్
- గతనెల రోజులుగా బాదుడే !
న్యూఢిల్లీ : నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డివిరిస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.80కు చేరువైంది. డీజిల్ ధర 72రూపాయలు దాటింది. చమురు సంస్థలు నవంబరు 9 నుంచి ప్రతిరోజూ ఇంధన ధరల్ని పెంచుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల్ని సాకుగా చూపుతూ ధరల పెంపునకు కేంద్రం గ్రీన్‌సిగల్ ఇస్తోంది. ఈనేపథ్యంలో గత నెలరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటమేగానీ, తగ్గిన దాఖలా లేదు. సోమవారంనాటికి దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ 75రూపాయలకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.66 దాటింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.79.81పైసలకు, లీటర్ డీజిల్ రూ.72.07కు చేరుకుంది. లీటర్ పెట్రోల్‌పై 15పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెంచారు. ఇంధన ధరల్ని ప్రతిరోజు 5 పైసలు, 10 పైసలు పెంచుతూ వస్తున్నారు. ఈవిధంగా గత నెలరోజుల కాలంలో చమురు సంస్థలు ఇంధన ధరల్ని రూ.2.30 పైసలు పెంచాయి. నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు.
ఈ ఏడాది సెప్టెంబరులో సౌదీ అరేబియా చమురు క్షేత్రంపై క్షిపణి దాడి జరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. దీనిని సాకుగా చూపి కేంద్రం ధరల పెంపునకు సిద్ధమైంది. ఒకవేళ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే, ఆమేరకు ఇక్కడ ధరల్ని తగ్గించటం లేదన్న ఆగ్రహం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.