Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతిభవన్‌కు లాంగ్‌మార్చ్.. ఖాకీల ప్రతాపం
- చర్చలకు ఆహ్వానించిన ఎంహెచ్‌ఆర్డీ
- సెంట్రల్ ఢిల్లీలోని మూడు మెట్రో స్టేషన్ల మూసివేత
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
పెంచిన భారీ ఫీజులను వెనక్కితీసుకోవాలంటూ రాష్ట్రపతిభవన్‌కు లాంగ్‌మార్చ్ చేపట్టిన జేఎన్‌యూ విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించారు. తమ యూనివర్సిటీ విజిటర్ ఛాన్సెలర్‌గా ఉంటున్న రాష్ట్రపతికి తమ ఆందోళన తెలియజేద్దామని బయలుదేరిన విద్యార్థిని, విద్యార్ధులపై పోలీసులు తీవ్రంగా లాఠీచార్జి చేశారు. రాష్ట్రపతిభవన్‌కు వస్తున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వెనక్కి వెళ్లాలంటూ బెదిరించారు. అయితే, వారి హెచ్చరికలను లెక్క చేయకుండా విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు కొట్టారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని, జేఎన్‌యూలో పెంచిన ఫీజులు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా జేఎన్‌యూ విద్యార్థులు దశల వారీ పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పార్లమెంట్‌కు లాంగ్‌మార్చ్ చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీలతో రెచ్చిపోయారు. అంతకుముందు.. తమ సమస్యలను రాష్ట్రపతికి చెప్పుకునేందుకు జేఎన్‌యూ విద్యార్థులు రాష్ట్రపతిభవన్ లాంగ్‌మార్చ్ చేపట్టారు. జేఎన్‌యూ నుంచి ప్రారంభమైన మార్చ్ పోలీసుల వలయంలో బికాంజీకామా వరకు చేరుకుంది. అక్కడ విద్యార్థుల ముందుకు కదలనీ యకుండా పోలీసులు అడ్డుకున్నారు. హయత్‌నగర్ హోటల్ వద్ద గుమిగూడిన విద్యార్థులపై మరోసారి లాఠీచార్జికి దిగారు. అక్కడ నుంచి ఆర్కేపురం రోడ్డు వద్దకు వచ్చిన విద్యార్థులను పరిగెత్తించి మరీకొట్టారు. ఈ సంఘటనతో ఎంహెచ్‌ఆర్డీ విద్యార్థులను మంగళవారం చర్చలకు ఆహ్వానించింది. జేఎన్‌యూ ఎస్‌యూ నేతృత్వంలో జరిగిన ఈ లాంగ్‌మార్చ్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఎస్‌ఎఫ్‌ఐ, ఎఐడీఎస్‌ఓ, డీఎస్‌ఓ తదితర విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
పార్లమెంట్ స్ట్రీట్‌లో డీయూటీఏ భారీ ధర్నా
ఢిల్లీ యూనివర్సిటీలో అడహక్ లెక్చలర్ల సమస్యలపై ఢిల్లీ వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డీయూటీఏ) పార్లమెంట్ స్ట్రీట్‌లో ఆందోళన చేపట్టింది. తొలుత స్థానిక మండిహౌస్ నుంచి ర్యాలీగా పార్లమెంట్ స్ట్రీట్‌కు చేరుకున్నారు. పార్లమెంట్ స్ట్రీట్‌లో ఏర్పాటుచేసిన బారికేడ్ల వైపు నిరసన కారులు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. బారికేడ్లు ఎక్కినవారిని ప్రత్యేక వ్యాన్లలో స్థానిక పోలీసుస్టేషన్‌కి తరలించారు.
విద్యార్థుల ఆందోళనతో సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్
జేఎన్‌యూ నుంచి రాష్ట్రపతిభవన్‌కి వెళ్లే రహదారుల్లో పోలీసులు మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. అన్నిదారులను తమ ఆధీనంలోకి తీసుకొని వాహనాల రాకను ముందుగానే నిషేధించారు. బాబా జ్ఞానవత్ మార్గ్, సరోజిన నగర్ మార్గాల్లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఆ ఏరియా నుంచే వచ్చే వాహనాలకి లీలా హయత్, ఐఎన్‌ఎ మార్కెట్ వైపు మళ్లించారు. అయినప్పటికీ, విద్యార్థుల లాంగ్‌మార్చ్ కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వివేకానంద మార్గ్, రింగ్ రోడ్డు, మోతి బాగ్ తదితర ప్రాంతాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున రావడంతో వాహనాలు బారులు తీరాయి. బికాంజీకామా, సెంట్రల్ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను సైతం మూసివేశారు.