Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ)లో సంస్కృత విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఫిరోజ్‌ఖాన్‌కు నియమించడానికి మద్దతు ఇచ్చినందుకు తనపై విద్యార్థులు దాడి చేశారని ప్రొఫెసర్ శాంతిలాల్ సాల్వీ ఆరోపించారు. ఈ ఘటనపై సాల్వీ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను తరగతి గదిలో ఉండగా పలువురు విద్యార్థులు అసభ్యపదజాలంతో దూషించారు. ఫిరోజ్‌ఖాన్ నియామకానికి సంబంధించి మద్దతు ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఈ క్రమంలో నేను బయటకు రావడానికి ప్రయత్నం చేయగా, పలువురు విద్యార్థులు నాపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం నన్ను కొట్టార'ని తెలిపారు. తనపై దాడి చేయడానికి వర్సిటీకి చెందిన మరో ప్రొఫెసర్ విద్యార్థులను ప్రేరేపించాడనీ, సదరు వ్యక్తి పేరును తాను వెల్లడించబోనని అన్నారు. అలాగే వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాకేశ్ భట్నాకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. సాల్వీపై జరిగిన దాడిపై దర్యాప్తు చేయడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని వర్సిటీ పరిపాలన విభాగం ప్రకటించింది. అయితే, తాము దాడిచేయలేదనీ, ఫిరోజ్‌ఖాన్‌ను మరో విభాగానికి మార్చాలని డిమాండ్ చేసినట్టు విద్యార్థులు వెల్లడించడం గమనార్హం. కాగా, బీహెచ్‌యూ సంస్కృత విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఫిరోజ్‌ఖాన్ గత నెలలో నియమితులయ్యారు. ముస్లిం మతానికి చెందిన వ్యక్తిని సంస్కృత విభాగానికి ప్రొఫెసర్‌గా నియమించడాన్ని పలువురు విద్యార్థులు వ్యతిరేకిస్తూ, ఆందోళనలు చేస్తున్నారు.