Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంను కోరిన నిర్భయ దోషి
న్యూఢిల్లీ : 2012 డిసెంబరు నాటి నిర్భయపై సామూహిక లైంగిక దాడి, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై ఓవైపు ఊహాగానాలు వెల్లువెత్తు తుండగా.. మరోవైపు తీర్పును సమీక్షించాలంటూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ ఠాకూర్ (31) ఈ పిటిషన్‌ను దాఖలుచేశారు. తనకు ఉరిశిక్ష విధిస్తూ 2017లో కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ గతంలో రివ్యూ పిటిషన్ దాఖలుచేశారు. 2018 జులై 9న అత్యున్నత న్యాయస్థానం వారి పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, గతంలో రివ్యూ పిటిషన్ దాఖలుచేయని అక్షరు తాజాగా మంగళవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. 'ఢిల్లీలో వాయు, జల కాలుష్యంతో ఎలాగో నా ఆయుష్షు తగ్గిపోతున్నది. దయచేసి నాకు మరణశిక్ష వేయొద్దు..' అని అక్షయ్ సింగ్ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరాడు. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంలో, సురక్షితమైన తాగు నీరు ప్రజలకు అందించటంలో ప్రభుత్వాలు విఫలమవటంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 2012 డిసెంబర్ 16న నిర్భయపై అఘాయిత్యానికి పాల్పడటమేకాక.. ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఘటన దోషుల్లో అక్షయ్ సింగ్ ఒకరు. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులుగా తేలగా.. నిందితుల్లో ఒకడైన రామ్‌సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనరు కావటంతో కోర్టు అతడికి మూడేండ్లు జైలు శిక్ష విధించింది.