Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఉన్నావో' గ్రామస్తుల ఆందోళన
లక్నో: పలు ఆందోళనలు, కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఉన్నావో లైంగికదాడి బాధితురాలి అంత్యక్రియలు ఆదివారం ముగియగా, అధికారులు ఆమె సమాధిని మంగళవారం నిర్మించేయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తుల నుంచి తీవ్రవ్యతిరేకత ఎదురైంది. తమకు న్యాయం జరిగేంతవరకు సమాధి కట్టనిచ్చేదిలేదని ఉన్నావో లైంగికదాడి బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్మాణానికి తెచ్చిన ఇటుకలను ధ్వంసం చేశారు. 'దిశ' కుటుంబానికి జరిగిన న్యాయమే తమకూ జరగాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడానికీ వెనుకాడనని మృతురాలి సోదరి హెచ్చరించింది. ప్రస్తుతం ఆమె ఛాతినొప్పి కారణంగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నది. కాగా, లైంగికదాడికి గురైన యువతి కోర్టుకు వెళ్లే క్రమంలో నిందితులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. 90శాతానికి పైగా కాలిన గాయాలతో బాధితురాలు ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది.
'ఉన్నావో' తీర్పురిజర్వ్
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగార్ ప్రధాన నిందితుడుగా ఆరోపణ లెదుర్కొంటున్న ఉన్నావో లైంగికదాడి కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పును ఈ నెల 16 వరకు రిజర్వులో పెట్టినట్టు ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన వాదనలను కోర్టుకు వినిపించింది. అలాగే ఈ నెల 2నే డిఫెన్స్ సాక్షుల వాంగ్మూలాల రికార్డింగ్ కూడా పూర్తయింది. 2017లో జరిగిన ఘటనలో ఓ బాలికను కిడ్నాప్, లైంగికదాడి చేసినట్టు బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగార్‌తో పాటు తన సోదరుడు శశి సింగ్‌పై కూడా అభియోగాలున్నాయి.