Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అందనంత దూరానికి..
- పలు చోట్ల కిలోకు రూ. 200
- ధరలను తగ్గించడంలో మోడీ సర్కారు విఫలం
న్యూఢిల్లీ : సాధారణంగా ఉల్లిపాయలను కోసేటప్పుడు కంట్లో నుంచి వచ్చే కన్నీరు.. కొద్దిరోజులుగా కొందామంటేనే వస్తున్నది. గడిచిన ఐదు నెలల్లో వాటి ధరలు 253 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలుకుని ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయే తప్ప నేలచూపులు చూసిన దాఖలాలే లేవని మార్కెట్ ట్రెండ్‌ను బట్టి చూస్తే తెలుస్తున్నది. 2019 మే లో రిటైల్ మార్కెట్‌లో రూ. 30 ఉన్న కిలో ఉల్లిపాయలు.. నేడు దేశంలోని పలుచోట్ల రూ. 170 నుంచి రూ. 200 దాకా పలుకుతున్నవి. కిలో చికెన్ ధర కంటే ఉల్లిపాయల ధరలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో వినియోగదారులు వాటిని కొనాలంటేనే బెంబేలెత్తుతున్నారు. మరోవైపు రైతుల దగ్గరి నుంచి ఉల్లి దిగుబడులను తక్కువ ధరలకు కొని, తాము దా(దో)చుకున్న ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ చేస్తున్న వ్యాపారులను అరికట్టడంలోనూ, ధరలను అదుపులోకి తీసుకురావడంలోనూ కేంద్రంలోని మోడీ సర్కారు దారుణంగా వైఫల్యం చెందుతున్నది.
ఈ ఏడాది మేలో బయట మార్కెట్‌లో గ్రేడ్-1 ఉల్లిపాయల ధర దేశవ్యాప్తంగా రూ. 25 వరకు ఉంది. ఇది ఆగస్టు నాటికి రూ. 50కు చేరుకుంది. అక్టోబర్ (కిలో రూ. 80) నుంచి ధరలు కొండెక్కుతున్నాయి. నవంబర్ మధ్య నాటికి రూ. 100 మార్కు చేరుకున్న ఉల్లి.. డిసెంబర్ మొదటివారంలో రూ. 160కు చేరుకున్నది. ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో ఇది రూ. 200 దాకా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రిటైల్ మార్కెట్లలోనూ ధరలు ఇంతకు భిన్నంగా ఏమీ లేవు. ఆగస్టులో రిటైల్ మార్కెట్‌లో రూ. 30 ఉన్న ఉల్లి.. డిసెంబర్ నాటికి రూ. 140కు చేరుకున్నది.
2014కు ముందు యూపీఏ-2 ప్రభుత్వం పాలనలో ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగాయి. ఈ నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీయే.. ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేసింది. ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో నిత్యావసర సరుకుల రేట్లను తగ్గిస్తానని ఆయన పాల్గొన్న సభలలో ఉద్ఘాటించారు. కానీ ఆయన వచ్చిన తర్వాతి నుంచి ధరలు అంతకంతకూ పెరిగాయే తప్ప తగ్గిన దాఖలాలు లేవని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు ఉల్లిపాయల ధరలు పెరగడానికి ప్రకృతి వైపరిత్యాలే కారణమని కేంద్రం చెబుతున్నది. దేశంలో ఉల్లిసాగు చేస్తున్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో ఈ సీజన్‌లో కురిసిన వర్షాలతో పంట దిగుబడి తగ్గిందని కేంద్రం అంటున్నది. కానీ బ్లాక్‌మార్కెట్ వ్యాపారులు నిల్వ ఉంచిన టన్నుల కొద్ది దిగుబడులను మాత్రం బయటకు తీసుకురావడం లేదని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి దిగుమతులనూ తగ్గించడంతో వినియోగానికి సరిపడక ధరలు పెరుగుతున్నాయి.
దీనిపై స్వాభిమాని షెట్కారి సంఘటన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాజుశెట్టి స్పందిస్తూ.. 'మేం దిగుమతులకు వ్యతిరేకం కాదు. రైతులు పండించే పంట చేతికొచ్చే సమయానికి కేంద్రం ఉల్లిని దిగుమతి చేసుకుంటుంది. దాంతో ఉత్పత్తులు ఎక్కువై ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఫలితంగా ఉల్లి పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గడిచిన రెండేండ్లుగా ఉల్లి రైతులు మునుపెన్నడూ లేని నష్టాలను చవిచూస్తున్నారు. కానీ వారి దగ్గర పంటను కొన్న దళారులు మాత్రం లాభాలు గడిస్తున్నారు' అని తెలిపారు.