Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ వారంలోనే పార్లమెంటు ముందుకు వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు
- జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా బిల్లులో కేంద్రం మార్పులు
- సెలెక్ట్ కమిటీకి పంపించాలని న్యాయ నిపుణుల సూచన
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార భద్రత(పీడీపీ) బిల్లు ఈ వారంలో పార్లమెంట్ ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో పౌరుల గోప్యత హక్కుకు భంగం కలిగించే అంశాలున్నాయని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పౌరుల సమ్మతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోరాదన్న నిబంధనతో రూపొందించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా బిల్లు స్ఫూర్తికి మోడీ సర్కార్ తెస్తున్న బిల్లు విరుద్ధంగా ఉన్నదని వారు చెబుతున్నారు. సోషల్ మీడియా కంపెనీలు తమ ఖాతాదారుల సమాచారాన్ని ప్రభుత్వ ఏజెన్సీల స్వచ్ఛంద పరిశీలనకు అనుమతించేలా బిల్లులో కొన్ని క్లాజుల్ని చేర్చడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ సర్కార్ తేనున్న చట్టానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన ముసా యిదా బిల్లు ఆధారం. 2018లోనే ముసాయిదా బిల్లును పౌర సమాజం ముందు చర్చకు పెట్టారు. అయితే, కృష్ణ కమిటీ బిల్లును మోడీ సర్కార్ యథాతథంగా ఆమోదిం చలేదు. దానికి కొన్ని మార్పులు చేసింది. ఏయే విషయాల్లో మార్పులు చేసింది మాత్రం ఇప్పటి వరకూ రహస్యమే. దాంతో, బిల్లుకు పార్లమెంట్ నుంచి ఆమోదం పొందడానికి ముందు సెలెక్ట్ కమిటీకి పంపించాలని జస్టిస్ శ్రీకృష్ణసహా పలువురు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పీడీపీ బిల్లు ప్రతుల్ని ఎంపీలకు పంపిణీ చేశారు. కృష్ణ కమిటీ ముసాయిదా బిల్లులో లేని మూడు కీలక క్లాజుల్ని క్యాబినెట్ ఆమోదించిన బిల్లులో చేర్చారు. సెక్షన్ 91లోని రెండో క్లాజ్‌లో డేటా నియంత్రణ సంస్థ నుంచి వ్యక్తిగత రహస్యాలు లేదా వ్యక్తిగతేతర సమాచారాన్ని తీసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. పౌరులకు నాణ్యమైన సేవల్ని అందించడం కోసం, సాక్ష్యాధారాల కోసం అవసరమైన సమాచారాన్ని డేటా నియంత్రణ సంస్థలు అందించాలని ఈ క్లాజ్‌లో పేర్కొన్నారు. ఈ అంశాలపై అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఉబర్‌లాంటి సంస్థలు సానుకూలంగా స్పందించాయి. పౌరుల ఖాతాల్లోని సమాచారాన్ని(ప్రభుత్వ ఏజెన్సీలు) స్వచ్ఛందంగా పరిశీలించేందుకు సోషల్ మీడియా సంస్థలు అనుమతించాలని బిల్లులోని సెక్షన్ 28లో పేర్కొన్నారు. అంటే..ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలు ప్రభుత్వ నిఘా సంస్థల నియంత్రణలోకి వెళ్తాయని అర్థం. ఆన్‌లైన్ ట్రోలింగ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిబంధన వర్తిస్తుందంటూ దీనిపై సమాచారశాఖ అధికారులు వివరణ ఇస్తున్నారు. కానీ, వ్యక్తిగత గోప్యత హక్కుకు ఇది భంగం కలిగించేలా ఉన్నదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రయివసీ హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత సున్నిత సమాచారాన్ని దేశం బయటికి పంపేందుకు కూడా బిల్లు అనుమతిస్తుంది. అయితే, భారత్‌లో అందుకు సంబంధించిన కాపీని స్టోర్ చేయాలని షరతు విధించారు. ఇప్పటికే పలువురు సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, పౌర హక్కుల కార్యకర్తల ఫోన్లను ఇజ్రాయెల్ కంపెనీ ఎన్‌ఎస్‌వో రూపొందించిన పేగాసస్ స్పైవేర్‌తో హ్యాకింగ్ చేయించిన ఆరోపణలున్నాయి. 121 మంది భారతీయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్టు భారత ప్రభుత్వానికి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే సమాచారమిచ్చినట్టు వాట్సాప్ నిర్వాహకులు తెలిపారు. పేగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వ ఏజెన్సీలకు మినహా ఎవరికీ విక్రయించమని ఆ కంపెనీ కూడా స్పష్టం చేయడంతో మోడీ సర్కార్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు పార్లమెంట్ ముందుకు వచ్చే పీడీపీ బిల్లు చట్ట రూపం దాలిస్తే పౌరుల గోప్యత హక్కు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లినట్టేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.